Revanth Reddy: చెడుపై మంచి సాధించిన గెలుపు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.
సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..
దసరా పండుగ మనకు ధైర్యం, ధర్మం, సత్యం, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు. మనలోని అహంకారం, అసూయ, ద్వేషం, అన్యాయం వంటి చెడు లక్షణాలను తొలగించుకుని, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ పండుగ సందేశమిస్తోందని అన్నారు. ఈ విజయదశమి ప్రతి ఇంటా ఆనందాల పూలు పూయించాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి దుష్టశక్తులపై విజయం సాధించిన అమ్మవారి శక్తిని, శ్రీరాముడు రావణాసురుడిపై సాధించిన విజయాన్ని ఈ పర్వదినం మనకు గుర్తుచేస్తుందన్నారు. తెలంగాణలో దసరా సందర్భంగా జమ్మిచెట్టుకు పూజలు చేయడం, జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రత్యేక సంప్రదాయమని గుర్తు చేశారు. ఈ ఆచారం ప్రకృతిని ప్రేమించాలని, పెద్దలను గౌరవించాలని చాటిచెబుతుందని అన్నారు.
Also Read: హైదరాబాద్‌లో కొత్త బోర్లకు నో పర్మిషన్! ఎల్‌నినోపై సీఎస్ సంజయ్ జాజు సంచలన ఆదేశాలు