Water Conservation: గ్రామీణ సంస్కృతిలో భాగమైన “డప్పు చాటింపు” లు దసరా తర్వాత మళ్లీ మోగనున్నాయి. ఎన్ నినో పరిస్థితులతో ఏర్పడిన నీటి కొరతపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు గ్రామాల్లో డప్పు చాటింపు చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది.పండుగ తర్వాత అన్ని గ్రామాల్లో డప్పు చాటింపులు వేయాలని ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. వాతావరణ మార్పులు, నీటి కొరత, విద్యుత్ సంక్షోభ ముప్పు నుంచి పల్లెలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ గ్రామీణ చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించనున్నది. అంతేగాక దసరా తర్వాత దీపావళీ వరకు గ్రామ సభల్లో నీరు, విద్యుత్ పొదుపు లపై చర్చించనున్నారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి, ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి చైతన్యం చేయనున్నారు. భూగర్భ జలాలు పడిపోకుండా కాపాడుకోవడం, బిందు,సమాంతర సేద్యం, అలాగే గృహ, వ్యవసాయ విద్యుత్ వృథాను అరికట్టే సరళమైన పద్ధతుల ను క్షేత్రస్థాయి ఆఫీసర్ల సమక్షంలో వివరించనున్నారు. ఈమేరకు స్పెషాలాఫీసర్లు …జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆదివారం ప్రత్యేకంగా సమీక్ష కూడా నిర్వహించారు.
పూర్వపు రోజుల్లో ఎదైన విషయాన్ని ప్రజలకు చేరవేసేందుకు, అత్యవసర ముప్పు వచ్చినప్పుడు గ్రామంలో చాటింపు వేసేవారు. సాంకేతికత పెరిగిన తర్వాత మైకులు, వాట్సాప్ గ్రూప్‌ల యుగంలో ఈ డప్పు శబ్దం మూలన పడింది. కానీ, ఊరి జనాన్ని ఒకచోటకు చేర్చడంలో, తీవ్రమైన సమస్య ప్రాధాన్యతను గుర్తించడంలో డప్పు చాటింపుకున్న శక్తి దేనికీ లేదని భావించిన ప్రభుత్వం, మళ్లీ ఈ సాంప్రదాయ విధానానికే ప్రాధాన్యమిచ్చింది. దసరా ముగిసిన మరుసటి ఉదయం నుంచే గ్రామాల్లో డప్పు దెబ్బతో రోజు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం తక్కువ లభ్యత ఉన్న నేపథ్యంలో కాపాడుకోవాల్సిన అంశాన్ని ఆ డప్పు శబ్ధం ద్వారా ప్రజలకు అలర్ట్ ఇవ్వనున్నారు.
Also read: రోడ్లు ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఎమ్మెల్యేల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం
వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ‘ఎన్ నినో’ ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి కరువు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ నీటి వృథా పద్ధతులకు స్వస్తి చెప్పి, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే ఆరుతడి పంటల వైపు మళ్లేలా రైతులకు నిపుణులు సలహాలు ఇవ్వనున్నారు.అంతేగాక వ్యవసాయ పంపుసెట్లకు ఆటో స్టార్టర్లు తగ్గించడం, పగటిపూట విద్యుత్ వాడకం, కేపాసిటర్ల వినియోగం వంటి అంశాలపై గ్రామీణులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తారు. కేవలం అధికారుల ఉపన్యాసాలతో సరిపెట్టకుండా, సమాచారం ప్రజల హృదయాలకు హత్తుకునేలా సాంస్కృతిక ప్రచారం డిజైన్ చేశారు. గ్రామీణ కళాకారులు తమ పాటలు, కోలాటాలు, వీధి నాటకాలు, ఒగ్గు కథల ద్వారా నీటి ప్రాధాన్యతను, విద్యుత్ పొదుపును కథల రూపంలో వివరించనున్నారు “చుక్క చుక్క నీరు దాచుకుందాం.. ఊరికి ఊపిరి పోసుకుందాం, వెలుగును పొదుపుగా వాడదాం.. రేపటి తరానికి బాటలు వేద్దాం ” తదితర స్లోగన్లతో హోర్టింగ్ లు ఏర్పాటు చేయనున్నారు. బస్ స్టాండ్లు, ప్రధాన చౌరస్తాలు, బహిరంగ ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
Also read: ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్