Assistant Professor: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉన్నత విద్యారంగంలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుడుతూ, తొలి విడతలో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీలో అత్యధికంగా 252 పోస్టులు ఉండగా, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో 49 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా త్వరలోనే నియామక నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉండటంతో, యూనివర్సిటీ కొలువుల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న వర్సిటీ నియామకాల ప్రక్రియకు ఈ ఉత్తర్వులతో సర్కారు ముందడుగు వేసింది. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు ఆమోదించిన ఖాళీల ఆధారంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి సమర్పించిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం గతంలో జారీ చేసిన యూనిఫాం గైడ్లైన్స్ అనుగుణంగానే ఈ రిక్రూట్మెంట్ను చేపట్టనున్నారు. ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ విభాగాలకు వేర్వేరుగా నిర్దేశించిన నిబంధనల ప్రకారం భర్తీ ప్రక్రియ సాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also read: ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!
ఆర్థిక శాఖ అనుమతి లభించిన నేపథ్యంలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల జారీకి ఉన్నత విద్యామండలి సెక్రటరీతో పాటు ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్ నిబంధనలు, రోస్టర్ పాయింట్లు వంటి అన్ని చట్టబద్ధమైన అవసరాలను నిశితంగా పరిశీలించి, ఎక్కడా లోపాలు లేకుండా పారదర్శకంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో నిరుద్యోగ నిపుణులు, పీహెచ్డీ, నెట్, సెట్ అర్హతలు సాధించిన అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పోస్టుల్లో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్టులతో పాటు ఇంజినీరింగ్, లా, జర్నలిజం, బిజినెస్ మేనేజ్మెంట్ వంటి వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉండగా అత్యధికంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 252 పోస్టులు ఉన్నాయి. ఓయూలో ఎకనామిక్స్(18), లా(16), సివిల్ ఇంజనీరింగ్(15), ఫిజికల్ ఎడ్యుకేషన్(13), ఇంగ్లిష్(12) విభాగాల్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. శాతవాహన, పాలమూరు వర్సిటీల్లోని కొత్త ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా పెద్ద సంఖ్యలో పోస్టులను కేటాయించారు. ఈ నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి వర్సిటీల్లో విద్యా ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత వర్సిటీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు రావడంతో నిరుద్యోగులు, పీహెచ్డీ అభ్యర్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ 252
కాకతీయ యూనివర్సిటీ 49
శాతవాహన యూనివర్సిటీ 49
పాలమూరు యూనివర్సిటీ 45
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 16
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 16
తెలంగాణ యూనివర్సిటీ 02
మొత్తం 429.