Rice Millers: కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు, పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ధాన్యాన్ని దారిమళ్లించి, బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లపై విజిలెన్స్, సీబీ సీఐడీ విభాగాలు రంగంలోకి దిగాయి. జమ్మికుంటలో ముగ్గురు మిల్లర్లతో పాటు ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అంగుళం విడవకుండా తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ధాన్యం నిల్వలకు, మిల్లుల్లో ప్రత్యక్షంగా ఉన్న నిల్వలకు మధ్య భారీ తేడాలు బయటపడుతున్నాయి. దీనికితోడు గత పదేళ్ల సీఎంఆర్ లావాదేవీలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో మిల్లర్లలో గుబులు మొదలైంది. ఒకవైపు అధికారుల తనిఖీలు శరవేగంగా జరుగుతుంటే, మరోవైపు మిల్లర్లు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
జప్తులు, రికవరీలకు సన్నాహాలు
నిబంధనలు ఉల్లంఘించిన మిల్లర్లపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. బకాయి పడ్డ వారికి ఇప్పటికే ఆఖరి నోటీసులు జారీ చేస్తున్నారు. నిర్దేశిత గడువులోగా సీఎంఆర్ బియ్యాన్ని లేదా దానికి సమానమైన సొమ్మును చెల్లించకపోతే, మిల్లర్ల ఆస్తులు, మిల్లులు, యంత్రాలు, వాహనాలను జప్తు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే డిఫాల్ట్ అయిన మిల్లర్ల బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేయనున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకున్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: ఫీజు బకాయిలు ఇవ్వరు కానీ లక్షల ఫైన్లా? ఇంటర్ బోర్డు వైఖరిపై ప్రైవేట్ కాలేజీల సంఘం ఆగ్రహం!