Congress Warning: స్వేచ్చ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ,యూత్ కాంగ్రెస్ తదితర విభాగాల తీరుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)అత్యంత సీరియస్ గా స్పందించింది. అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థి, యువజన విభాగాలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండగా..కొందరు నేతలు నిబంధనలు అతిక్రమించి వర్సిటీలు,విద్యాసంస్థల్లో దాడులు,రచ్చకు దిగడంపై పీసీసీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పింది.
ఇటీవల కొన్ని విద్యాసంస్థలు, కాలేజీ క్యాంపస్లలో చోటుచేసుకున్న భౌతిక దాడులు, అల్లర్ల ఘటనలను పీసీసీ తీవ్రంగా పరిగణించింది. విద్యార్థుల సమస్యలు, విద్యావ్యవస్థలోని లోపాలపై ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాడాల్సింది పోయి, రచ్చ సృష్టించడం వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని పీసీసీ ముఖ్య నేతలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి,పార్టీకి మంచి పేరు తీసుకురావాల్సిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు, ఇలాంటి వివాదాలతో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయని విమర్శించారు. ఇక నుంచి ఇలా వ్యవహరించిన విద్యార్ధి నేతలు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లీడర్లపై సీరియస్ గా వ్యవహరించాల్సి ఉంటుందని పీసీసీ హెచ్చరించింది.
విద్యార్థి, యువజన విభాగాల నాయకులు ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు చేపట్టినా చట్టానికి, రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని పీసీసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో గొడవలకు దిగడం, అధికారులను లేదా యాజమాన్యాలను భౌతికంగా బెదిరించడం వంటి చర్యలకు స్వస్తి పలకాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య లీడర్లకు పీసీసీ నుంచి ప్రత్యేకంగా హెచ్చరికలు, మార్గదర్శకాలు వెళ్లాయి.క్రమశిక్షణ దాటి ప్రవర్తించే వారిపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని పీసీసీ వర్గాలు హెచ్చరించాయి.
Also read: తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పీసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.పట్టభద్రులు, విద్యాధికులు ,యువత ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికల సమయంలో ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నేతల వివాదాస్పద వైఖరి వల్ల పార్టీ ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింటోందని పీసీసీ నేతలు తీవ్రంగా స్పందించారు.సమాజంలో చదువుకున్న వర్గాలు, మేధావులు పార్టీ వైఖరిని నిశితంగా గమనిస్తుంటారని,ఈ సమయంలో ఇటువంటి అల్లర్లు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓటర్లలో ప్రతికూల భావన ఏర్పడకుండా, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరియు ఉద్యోగ నియామకాల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఇక నుంచి ఏవైనా విద్యాసంబంధిత సమస్యలు లేదా నిరుద్యోగ సమస్యలు ఉంటే నేరుగా సంబంధిత మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, అంతే తప్ప సొంతంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని పీసీసీ స్పష్టం చేసింది. పద్ధతి మార్చుకోని నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తక్షణమే పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చింది.
Also read: గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?