Haritha Hotels: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమావేశాలు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ పరిధిలోని హరిత హోటళ్లను ప్రాధాన్య వేదికలుగా ఎంపిక చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, జిల్లా నోడల్ అధికారులకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగే కాన్ఫరెన్స్లు, వర్క్షాప్లకు హరిత హోటళ్లను గరిష్టంగా వినియోగించుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.
పర్యాటక శాఖ హోటళ్ల ఆర్థిక పురోభివృద్ధిని పెంచడంతో పాటు ప్రభుత్వ నిధులు వృథా కాకుండా చూడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశాల నిర్వహణకు అవసరమైన కాన్ఫరెన్స్ హాళ్లు, వసతి, క్యాటరింగ్ సౌకర్యాలను ముందే పరిశీలించి ప్రణాళిక చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. బుకింగ్లు, ఖర్చులన్నీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి, బడ్జెట్ లభ్యతను బట్టి మాత్రమే జరగాలని, అనవసర ఖర్చులను పూర్తిగా నివారించాలని ఆదేశించారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని, క్షేత్రస్థాయి అధికారులందరూ దీనిని ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also read: ‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్