Inter Exam Fees: వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజుల చెల్లింపు షెడ్యూల్ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి విడుదల చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన అభ్యర్థులు(జనరల్, వొకేషనల్), హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు ఈ పరీక్ష ఫీజు చెల్లించడానికి అర్హులని బోర్డు సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 26 నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. కాగా నవంబర్ 9 వరకు గుడువు విధించారు. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 11 నుంచి 20వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 22 నుంచి 29 వరకు, రూ.1,000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు, రూ.2,000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 14 వరకు ఫీజు చెల్లింపులు చేపట్టవచ్చని అధికారులు సూచించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం(జనరల్ రెగ్యులర్) విద్యార్థుల ఫీజు రూ. 540 గా నిర్ణయించారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం(వొకేషనల్ రెగ్యులర్ – థియరీ, ప్రాక్టికల్స్ కలిపి) రూ.890 చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం(జనరల్ ఆర్ట్స్) విద్యార్థులకు రూ. 540 ఫీజుగా నిర్ణయించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం(జనరల్ సైన్స్ – థియరీ, ప్రాక్టికల్స్ కలిపి) రూ.890గా, ఇంటర్ ద్వితీయ సంవత్సరం (వొకేషనల్)కు రూ.890 గా ఫీజు నిర్ణయించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నిర్ణీత గడువులోగా పరీక్షల ఫీజును చెల్లించాలని విద్యా మండలి సూచించింది.
Also read: ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?