Adluri Lakshman: ఎల్ నినో, తాగు – సాగునీటి అంశాలపై బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ సోయిలేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎల్పీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్ గత పాలనపై, ప్రతిపక్ష నేతల విమర్శలపై నిప్పులు చెరిగారు. కరోనా కాలం నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.
కోవిడ్ విపత్తు సమయంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వందలాది ప్రాణాలను బలిగొందని మంత్రి అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరోనా వస్తే పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తేలికగా మాట్లాడారు. కరోనాతో చెలగాటమాడి వందలాది మంది చావుకు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కారణం కాదా?’ అని ప్రశ్నించారు. ఆపత్కాలంలో రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో లక్ష రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాను తన చెల్లెలిని కోల్పోయానని భావోద్వేగానికి గురయ్యారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో కరోనా కోసం సరైన ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంలో హరీష్ రావు పూర్తిగా విఫలమయ్యారని, ఆయన అసమర్థత వల్లే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి మండిపడ్డారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి విమర్శించారు. ‘వరి వేస్తే ఉరి’ అని చెప్పి రైతులను భయపెట్టి మోసం చేశారని, అన్నదాతలను పట్టించుకోకుండా వారికి బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. పదేళ్ల పాటు మీరే రాజులు, మీరే మంత్రులుగా చక్రం తిప్పి నేడు ప్రజలను మోసం చేయాలని చూస్తే కుదరదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలు ఎండిపోయాయని మంత్రి తెలిపారు. అయితే దీనిని కూడా రాజకీయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు వచ్చిందని బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపుతో మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారని, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాధ్యతతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
కేసీఆర్ హయాంలో మేడిగడ్డ కుంగిపోయి కాళేశ్వరం కాస్తా ‘కులేశ్వరం’లా మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లది కేవలం ‘దోచుకుందామా? ‘ అనే ఆలోచన మాత్రమేనని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిధుల దోపిడీకి ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నేడు తెలంగాణలో అత్యధిక వరి పంట పండుతోందని గుర్తుచేశారు.
Also Read: ‘అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు’.. చైనా వ్యూహంపై కేంద్ర మంత్రి సెటైర్లు!
అటు ప్రభుత్వం కూలిపోతుందంటూ పదే పదే కలలు కంటున్న బీఆర్ఎస్ నేతలకు మంత్రి అడ్లూరి గట్టి కౌంటర్ ఇచ్చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అబివృద్ధి పథంలో దూసుకుపోతోందని, రాబోయే కాలంలోనూ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: చదువుకున్న స్కూల్లోనే దారుణం.. ప్రిన్సిపల్‌పై మాజీ స్టూడెంట్స్ దాడి.. పాఠశాల డబ్బుతో జంప్!