Rice Scam: స్వేచ్చ బ్యూరో: ఖరీఫ్ 2025–26 సీజన్ కు గానూ భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కి సరఫరా చేయాల్సిన సన్న రకం బియ్యం డెలివరీల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. పౌర సరఫరాల కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు మూడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆదివారం వేర్వేరు బృందాలుగా విడిపోయి రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేశారు. ఈ క్రమంలో 14 మంది రైస్ మిల్లర్లను అరెస్ట్ చేశారు.
ఖరీఫ్ 2025–26 సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దీని ద్వారా ఎఫ్సీఐకి 59.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించాలన్నది లక్ష్యం. అయితే, కొంతమంది రైస్ మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన సన్న రకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లోకి మళ్లించి సొమ్ము చేసుకున్నారు. సన్న బియ్యం స్థానంలో ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరకు తెచ్చిన ‘దొడ్డు రకం’ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్‌ఫోర్స్ (ఈటీఎఫ్) బృందాల తనిఖీలు, ల్యాబ్ పరీక్షల్లో ఈ మోసం బయటపడింది. ఇది కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. ఇలా చెయ్యటం వల్ల మిల్లర్లు ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొట్టారు.
దర్యాప్తులో ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో మోసాలు జరిగినట్టు తేలింది. ఈ మూడు జిల్లాల్లోని 16 రైస్ మిల్లులు సన్న రకానికి బదులుగా 3,385.820 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసినట్టు వెళ్లడయ్యింది. ఫలితంగా బోనస్ కు సంబంధించి ప్రభుత్వానికి దాదాపు 1.69 కోట్ల నష్టం వాటిల్లినట్టు తేలింది. మరో 45,414.833 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా ఇలాగే మార్చడానికి ఆయా మిల్లులకు కేటాయించారు. ఇలాగే అక్రమాలు సాగి ఉంటే దాదాపు 242 కోట్ల బోనస్ నిధులు దుర్వినియోగం అయ్యేవి. అయితే, మోసాలు వెలుగు చూడటంతో సివిల్ సప్లైస్ అధికారులు స్టాపేజ్ ఆర్డర్లు జారీ చేశారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం తప్పింది.
Also read: మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!