E-Paper
Advertisement

మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం.. తెలుగు సాహిత్యానికి అరుదైన గౌరవం!

మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం.. తెలుగు సాహిత్యానికి అరుదైన గౌరవం!
Advertisement

Maharashtra Honors Telangana Children’s Literature: తెలంగాణ సాహిత్యం.. అందులోనూ బాల సాహిత్యానికి చక్కటి గుర్తింపు లభిస్తోంది. అందులో భాగంగానే నల్లగొండ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు, ప్రముఖ బాల సాహితీవేత్త కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రచించిన ‘కంప్యూటర్ పిల్లలం’ అనే బాలగేయం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి విడుదల చేసిన నాలుగో తరగతి తెలుగు బాల భారతి పాఠ్యపుస్తకంలో చోటు దక్కించుకుంది. ఆయన రచించిన ‘ఊగుతున్న ఉయ్యాల’ బాలగేయాల సంపుటి నుంచి ఈ గేయాన్ని ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కించుకున్న అతికొద్ది మందిలో బుచ్చిరెడ్డి ఒకరు కావడం విశేషం.  రెండేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన పాఠ్యాంశాల ఎంపిక కమిటీ.. ఆయన రచించిన బాల సాహిత్యం పుస్తకాలను పరిశీలించింది. ఆయన నుంచి పూర్తి సమాచారం తెలుసుకుంది. తాజాగా గేయాన్ని తెలుగు పాఠ్యపుస్తకంలో పాఠంగా పొందుపరిచింది.తన రచనను పాఠ్యాంశంగా ఎంపిక చేయడం పట్ల ఉపాధ్యాయుడు బుచ్చిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

రెండు దశాబ్దాలుగా బాలసాహిత్య సేవ

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గత 20 ఏళ్లకు పైగా బాలసాహిత్య రంగంలో విశేషంగా సేవలందిస్తున్నారు. చిన్నారుల కోసం కథలు, గేయాలు, కవితలు, పాటలు రాస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా సులభమైన భాషలో రచనలు చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.

ఉపాధ్యాయుడిగా.. రచయితగా ప్రయాణం

Advertisement

ప్రస్తుతం బుచ్చిరెడ్డి నల్లగొండ జిల్లా కనగల్లు మండలంలోని చిన్నమాదారం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 29 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే, మరోవైపు సాహిత్య రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. బోధించేది ఇంగ్లీష్ అయినప్పటికీ, మాతృభాష తెలుగు కోసం ఎన్నో విలువైన రచనలు చేశారు.

పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు

బుచ్చిరెడ్డి రచించిన ‘మొలకలు’, ‘బంతిపూలు’, ‘బహుమతి’ వంటి పిల్లల కథల పుస్తకాలు మంచి ఆదరణ పొందాయి. ఇటీవల విడుదలైన ‘ఊగుతున్న ఉయ్యాల’ బాలగేయాల సంపుటి కూడా పాఠకులను ఆకట్టుకుంది. ఇప్పటి వరకు 350కు పైగా పిల్లల కథలను రచించి బాలసాహిత్యానికి విశేష సేవలందించారు.

పిల్లల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం

Advertisement

తానే రచనలు చేయడమే కాకుండా, పిల్లల్లో కూడా రచనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో విద్యార్థులు రాసిన కథలు బాల చెలిమి, జాబిల్లి వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం విద్యార్థులు రాసిన 40 కథలతో ‘మాదారం మందారాలు’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్నో పురస్కారాలు

బాలసాహిత్యంలో చేసిన కృషికి గాను బుచ్చిరెడ్డికి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. సిద్ధిపేటకు చెందిన చంటి అనిల్ కుమార్ బాలసాహిత్య పురస్కారం, పెందోట బాలసాహిత్య పురస్కారం, కడప జిల్లా ప్రొద్దుటూరులోని కున్‌రెడ్డి ఫౌండేషన్ బాలసాహిత్య పురస్కారంతో పాటు అనేక సన్మానాలు, అవార్డులు అందుకున్నారు.

రచయిత బుచ్చిరెడ్డి గురించి..   

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి 1969 జూన్ 16న నల్లగొండ జిల్లా మేళ్లదుప్పలపల్లి గ్రామంలో మల్లారెడ్డి, సత్తెమ్మ దంపతులకు జన్మించారు. ఎంఏ, బీఈడ్, టిటీసీ, ఎల్ఎల్బీ విద్యను అభ్యసించారు. ఆయనకు భార్య అరుణ. కుమార్తె సిరి చందన, కుమారుడు సాయి చరణ్ రెడ్డి ఉన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఉపాధ్యాయ వృత్తితో పాటు సాహిత్య సేవను కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

సాహిత్య ప్రపంచం నుంచి అభినందనలు

మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ‘కంప్యూటర్ పిల్లలం’ బాలగేయాన్ని చేర్చడంతో రచయితకు రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రచయితలు, కవులు, ఉపాధ్యాయులు, సాహితీ అభిమానులు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు బాలసాహిత్యానికి దక్కిన గౌరవంగా అభివర్ణిస్తున్నారు.

Read Also: హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చి నీళ్ల కోసం క్యూ.. ఏంటీ.. ఈ నల్లగొండ బావి ప్రత్యేకత?

Related News

ఉక్కపోతకు గుడ్ బై.. దూసుకొస్తున్న భారీ వర్షాలు.. ఐఎండీ చల్లని కబురు!

మాదాపూర్ పరువు హత్య.. ఉప్పరపల్లిలో హైటెన్షన్.. నిందితుడి ఇంటిపై దాడి!

మీర్‌పేట్ ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో

Haritha Bhavan: ఖమ్మం జిల్లాలో రాబోతున్న హరిత భవన్ ఎలా ఉందో చూశారా?.. డిజైన్ చూస్తే మీ మైండ్ బ్లాకే!

ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మృతి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖుల సంతాపం!

Police Misconduct: న్యాయం చేయండి సార్ అంటూ 100 కి కాల్ చేస్తే.. రైతుపై ఎస్సై అతి దారుణంగా దాడి!

Sand Crackdown: అక్రమ ఇసుక రవాణా తనిఖీల్లో దారుణం.. బోలోరతో కానిస్టేబుల్‌‌ను తొక్కించే ప్రయత్నం..!

Big Stories

Advertisement
×