Police Misconduct: స్వేచ్చ బ్యూరో: పోలీస్ స్టేషన్లకు వచ్చేవారి పట్ల మర్యాదగా వ్యవహరించండి.. నిష్పాక్షిక విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయండి.. డీజీపీ మొదలుకుని అన్ని యూనిట్ల పోలీస్ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి తరచూ చేసే సూచనలివి. అయితే, క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి వారిపైనే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఉదంతమే వరంగల్ జిల్లా దుగ్గొండి పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసింది.
తాను కష్టపడి పండించిన పంటపై గడ్డిమందు చల్లి నాశనం చేశారంటూ ఓ రైతు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయటమే అతను చేసిన పాపమైంది. నేరుగా డయల్ 100కు ఎందుకు ఫోన్ చేశావంటూ ఎస్ఐ స్థాయి అధికారి ఆ రైతుపై చేయి చేసుకున్నారు. బలవంతంగా సెల్ ఫోన్ లాక్కొని డయల్ 100కు ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చుకున్నాడు. దీనిపై బాధితుడు డీజీపీ సీ.వీ.ఆనంద్ కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
Also read: Beerla Ilaiah: బీఆర్ఎస్ పార్టీపై బాంబ్ పేల్చిన బీర్ల ఐలయ్య.. కేటీఆర్‌ను పని ఖతం..!
దుగ్గొండి గ్రామానికి చెందిన తొగరు కట్టమల్లు, తొగరు జోరయ్య అన్నదమ్ములు. కాగా జోరయ్య ఆర్థికావసరాల నేపథ్యంలో 22గంటల భూమిని తాకట్టు పెట్టాడు. బాకీ చెల్లించక పోవటంతో ఆ భూమి బ్యాంక్ ద్వారా వేలానికి వచ్చింది. తాతముత్తాతల నుంచి వచ్చిన భూమి కావటంతో బ్యాంక్ వేలంలో పాల్గొన్న కట్టమల్లు 61వేల రూపాయలకు పాట పాడి 1998, డిసెంబర్లో ఆ భూమిని దక్కించుకున్నాడు. ఈ మేరకు నర్సంపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఆ భూమిలో కట్టమల్లు కుమారుడు రాజు వ్యవసాయం చేస్తున్నాడు. కాగా, అతని దాయాదులు, జోరయ్య కుమారులైన అశోక్, మాణిక్యాల రాజు కొంతకాలంగా ఆ భూమి తమదే అంటూ గొడవలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజు సాగు చేసిన మొక్కజొన్న, కంది పంటలపై ఇటీవల గడ్డిమందును స్ప్రే చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై రాజు డయల్ 100కు ఫోన్ చేయగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని హెల్ప్ లైన్ సిబ్బంది సూచించారు.
ఈ మేరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాజుకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. అసలు సమస్య ఏందని తెలుసుకోకుండానే ఎస్ఐ రణధీర్ రెడ్డి అతనిపై చేయి చేసుకున్నాడు. డయల్ 100కు డైరెక్ట్ గా ఎలా ఫోన్ చేస్తావంటూ దూషించాడు. దాంతో దిక్కుతోచని స్థితిలో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన రాజు జరిగిన విషయాన్ని వివరిస్తూ తన న్కాయవాది ద్వారా డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. తనపట్ల దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరాడు. డిగ్రీ పూర్తి చేసిన తాను మక్కువతో వ్యవసాయం చేస్తున్నట్టు తెలిపాడు. చదువుకున్న తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల సంగతేంటని వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. మరి చూడాలి దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో?.
Also read: Railway Safety: భువనేశ్వర్ టు విశాఖ రైళ్లు ఎక్కడికక్కడ బంద్.. తప్పిన పెను ప్రమాదం!