E-Paper
Advertisement

హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చి నీళ్ల కోసం క్యూ.. ఏంటీ.. ఈ నల్లగొండ బావి ప్రత్యేకత?

హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చి నీళ్ల కోసం క్యూ.. ఏంటీ.. ఈ నల్లగొండ బావి ప్రత్యేకత?
Advertisement

Konda Chelime Bavi History: నల్లగొండ నడిబొడ్డున్న ఉన్న పాతబస్తీలోకి అడుగు పెట్టి.. కొండ చెలిమె బావి ఎక్కడ అంటే ఎవ్వరైనా చెప్తారు. ఎందుకంటే, ఆ బావి గురించి తెలియని వాళ్లంటూ ఉండరు. ఈ బావి శతాబ్దానికి పైగా చరిత్రకు సజీవ సాక్ష్యం. ఫ్లోరైడ్ సమస్యతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నల్లగొండలో ఇదో అద్భుతమైన బావి. ఇప్పటికీ స్వచ్ఛమైన, తియ్యని తాగునీటిని అందిస్తూ ప్రజల దాహాన్ని తీర్చుతోంది. చుట్టుపక్కల బోరు బావుల్లో ఫ్లోరైడ్ నీరు వస్తున్నా, ఈ బావిలో మాత్రం నాణ్యమైన మంచినీరు లభించడం విశేషం. అందుకే స్థానికులు ఈ బావిని ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరంగా భావిస్తారు.

ఒకప్పుడు నల్లగొండకు తాగునీటి ఆధారం

నల్లగొండను నీలగిరి అని పిలిచే రోజుల్లో ఈ బావి వేలాది మందికి ప్రధాన తాగునీటి ఆధారం. కాలం మారింది. పట్టణం విస్తరించింది. ఆధునిక నీటి సరఫరా వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, కొండ చెలిమె బావి ప్రాధాన్యం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ వందలాది మంది ఈ బావి దగ్గరికి వచ్చి నీటిని తీసుకెళ్తుంటారు.

ఎంత కరువు వచ్చినా ఎండిపోని చరిత్ర

Advertisement

ఈ బావి గురించి స్థానికులు చెప్పే విషయాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఎండాకాలం ఎంత తీవ్రంగా ఉన్నా, కరువు కరాళనృత్యం చేసినా, ఈ బావి నీరు ఎప్పుడూ పూర్తిగా ఎండిపోలేదంటున్నారు. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండటంతో దీనిని చాలామంది ప్రకృతి అద్భుతంగా అభివర్ణిస్తారు. పక్కనే కొండ ఉండటంతో దాని అడుగు భాగం నుంచి ఈ బావిలోకి నీళ్లు ఊరుతాయంటారు. నిరంతరం ఊరే నీటిని చూసి ఇక్కడికి వచ్చే సందర్శకులు సైతం ఆశ్చర్యపోతుంటారు.

రోగాలను మాయం చేసే సుగుణాలు

ఈ బావి నీటికి ప్రత్యేకమైన రుచి ఉందని చాలామంది చెబుతారు. స్థానికులే కాదు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా ఈ నీటిని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఈ నీరు తాగిన వాళ్లలో ఇప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదంటారు. అంతేకాదు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు ఈ నీళ్లు తాగితే తగ్గుతాయని చాలామందిలో బలంగా నమ్ముతున్నారు కూడా. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, తరతరాలుగా ప్రజల్లో ఈ విశ్వాసం కొనసాగుతూనే ఉంది.

హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చి మరీ..

Advertisement

కొండ చెలిమె బావి ఖ్యాతి ఇప్పుడు నల్లగొండ జిల్లాకే పరిమితం కాలేదు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు కార్లలో వచ్చి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్తారు. 15 రోజుల నుంచి నెల రోజులకు సరిపడ నీళ్లను క్యాన్లలో పట్టుకుని తీసుకెళ్తారు. అవి అయిపోగానే మళ్లీ వస్తారు. మరికొందరు స్థానికులు ఈ నీటిని తోడి.. సమీప కాలనీలు, దుకాణాలకు సరఫరా చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ బావి స్వచ్ఛమైన నీటిని అందించడమే కాకుండా, కొంతమందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది.

రూ. 13 లక్షలతో బావి పునరుద్ధరణ

ఒక దశలో ఈ చారిత్రక బావి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. బావి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, కంపచెట్లు అలుముకోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ బావి చారిత్రక విలువను గుర్తించి సుమారు రూ.13 లక్షలతో పునరుద్ధరణ పనులు చేపట్టింది. బావి చుట్టూ అందమైన ఫ్లాట్‌ ఫారమ్ నిర్మించడం, పచ్చదనం కోసం మొక్కలు నాటించడం, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఈ చారిత్రక బావి కొత్త అందాలను సంతరించుకుంది. ఫ్లోరైడ్ సమస్యలతో పోరాడుతున్న నేలలో స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న ఈ బావి నిజంగానే నల్లగొండకు ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన కానుక. చరిత్ర, ప్రకృతి, ప్రజల విశ్వాసం.. ఈ మూడు కలిసిన అరుదైన వారసత్వ సంపదగా కొండ చెలిమె బావి నేటికీ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది.

Read Also: నల్లగొండలో ఆర్జాలబావి.. ఈ పేరు వెనుక ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉందా?

Related News

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

Big Stories

Advertisement
×