Sand Crackdown: స్వేచ్చ బ్యూరో: అక్రమ ఇసుక రవాణాపై చర్యలు చేపట్టిన రవాణా శాఖ శాఖ సిబ్బందికి ఖమ్మంలో ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న రవాణా శాఖ కానిస్టేబుల్ అశోక్ తీవ్రంగా గాయపడిన ఈ ఘటన రవాణా శాఖలో తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
మంగళవారం ఉదయం ఖమ్మం పోలీసు కమిషనర్ కార్యాలయం సమీపంలో రవాణా శాఖ ఇన్‌చార్జి డీటీఓ శ్రీనివాస్ తన బృందంతో కలిసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్‌ను త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలేరో వాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విధులు నిర్వహిస్తున్న రవాణా శాఖ కానిస్టేబుల్ అశోక్ తీవ్రంగా గాయపడ్డారు.ఆయనను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అశోక్‌తో పాటు ఇన్‌చార్జి డీటీఓ శ్రీనివాస్ కూడా హైదరాబాద్‌కు వెళ్లి చికిత్సను పర్యవేక్షిస్తున్నారు.
Also read: ACB Raid: నిద్రపోయే మంచం కింద ముప్పై రెండు లక్షలా?.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..!
అక్రమ ఇసుక రవాణాను అరికట్టే క్రమంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న అధికారులకు తగిన భద్రతా చర్యలు కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన విషయం తెలుసుకున్న రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని కానిస్టేబుల్ అశోక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్యులతో మాట్లాడారు. అలాగే జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్, రమేష్, పాండురంగారావు తదితర ఉన్నతాధికారులు కూడా ఆసుపత్రికి చేరుకుని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఇటీవలే భూపాలపల్లి జిల్లా డీటీఓ వెంకన్న విధి నిర్వహణలో జరిగిన లారీ ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఇంకా మరువకముందే, ఖమ్మంలో మరోసారి రవాణా శాఖ సిబ్బంది ప్రమాదానికి గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై రవాణా శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహించే సమయంలో అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Also read: Railway Safety: భువనేశ్వర్ టు విశాఖ రైళ్లు ఎక్కడికక్కడ బంద్.. తప్పిన పెను ప్రమాదం!