Colombia’s Rainbow River: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన నదులు ఉన్నాయి. నీలిరంగులో కనువిందు చేసే నదులు, క్రిస్టల్ క్లియర్ వాటర్ తో ఆకట్టుకునే రివర్లు, గులాబీ రంగులో కనిపించే పింక్ నదలూ ఉన్నాయి. అయితే, కొలంబియాలోని సెర్రానియా డి లా మకరేనా నేషనల్ పార్క్ మధ్యలో ప్రవహించే కానో క్రిస్టేల్స్ ప్రపంచంలోనే అత్యంత అందమైన నదుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ నది ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ ఆకట్టుకుంటుంది. సంవత్సరంలో కొన్ని నెలల పాటు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమ రంగులాంటి అనేక వర్ణాలతో మెరిసిపోతుంది. అందుకే దీనిని పంచవర్ణ నది లేదంటే లిక్విడ్ రెయిన్ బో అని కూడా పిలుస్తారు.
చాలామందికి ఈ రంగులు నీటిలో కలిసిన రసాయనాల వల్ల వస్తాయని అనిపించవచ్చు. కానీ, అది నిజం కాదు. ఈ అద్భుతానికి ప్రధాన కారణం మకరేనియా క్లావిగెరా అనే ప్రత్యేకమైన జలమొక్క. ఈ మొక్క నదీగర్భంలో పెరుగుతుంది. సరైన సూర్యరశ్మి, నీటి మట్టం, వాతావరణం లభిస్తే, ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారుతుంది. దీంతో నది అడుగు భాగం ఎర్రటి రంగులో మెరిసిపోతుంది. కానో క్రిస్టేల్స్ నది ప్రత్యేకత ఒక్క ఎరుపు రంగు మాత్రమే కాదు. నది నీరు చాలా స్వచ్ఛంగా ఉండటం వల్ల అడుగున ఉన్న మొక్కలు, రాళ్లు, ఇసుక అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. పచ్చని మొక్కలు, పసుపు రంగు రాళ్లు, ముదురు గోధుమ రంగు శిలలు, ఆకాశం నుంచి పడే నీలి ప్రతిబింబం కలిసి నదిని ఒక సహజ చిత్రంలా మార్చేస్తాయి. అందుకే ప్రతి ప్రాంతంలో వేర్వేరు రంగులు కనిపిస్తూ అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది.
ఈ నది ఏడాది పొడవునా ఒకేలా కనిపించదు. వేసవి కాలంలో నీరు తగ్గిపోతే మొక్కలు పూర్తిగా పెరగవు. మరోవైపు భారీ వర్షాల సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మొక్కలు నీటి అడుగున కనిపించకుండా పోతాయి. వర్షాకాలం ముగిసి నీటి మట్టం సరైన స్థాయిలో ఉన్నప్పుడు, సూర్యరశ్మి బాగా పడితేనే ఈ నది అసలు రంగుల అందాన్ని చూపిస్తుంది.
కానో క్రిస్టేల్స్ సున్నితమైన పర్యావరణ వ్యవస్థలో భాగం. ఇక్కడ పెరిగే జలమొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక నియమాలు అమలు చేస్తున్నారు. నదిలో కాలుష్యం కలిగించకుండా, మొక్కలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని సీజన్లలో మాత్రమే సందర్శకులను అనుమతించడం కూడా అందులో భాగమే. కానో క్రిస్టేల్స్ అందం సజీవ చిత్రపటంలా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ఈ అరుదైన ప్రకృతి అద్భుతాన్ని చూసేందుకు కొలంబియాకు వెళ్తుంటారు. ప్రకృతి తన అందాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించగలదో చెప్పే గొప్ప ఉదాహరణ కానో క్రిస్టేల్స్ నది.
Read Also: అక్కడ అడవులు నడుస్తాయట.. ఇదేం చిత్రం భయ్యా!