TET Results Confusion: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాల విడుదల అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చిన అధికారులు, కేవలం గంట వ్యవధిలోనే వాటిని తొలగించడం ఈ గందరగోళానికి కారణమైంది. ఫలితాలు వచ్చేశాయని ఆనందపడేలోపే లింక్ క్లోజ్ అవ్వడంతో అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు.
చాలా కాలంగా ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు సోమవారం అర్ధరాత్రి టెట్ అధికారిక వెబ్‌సైట్లో ఫలితాల లింక్ ప్రత్యక్షం కావడంతో అప్రమత్తమయ్యారు. కొందరు అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకున్నారు. అయితే కాసేపటికే వెబ్‌సైట్ నుంచి ఆ లింక్‌ను తొలగించడమే కాకుండా సైట్ ఓపెన్ కాకుండా నిలిపివేయడంతో అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది.
ఈ పరిణామంపై విద్యాశాఖను పలువురు సంప్రదించగా ఇది కేవలం టెస్టింగ్ ప్రక్రియలో భాగంగా జరిగినట్లు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. . వెబ్‌సైట్ సర్వర్ సామర్థ్యాన్ని, సాంకేతిక అంశాలను సరిచూసే క్రమంలో ఫలితాల లింక్ పొరపాటున లైవ్‌లోకి వచ్చిందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. సాంకేతిక కారణాల వల్ల సోమవారం రాత్రి ఫలితాలు డిస్ ప్లే అయ్యాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు 10 శాతం మంది ఫలితాలు చూసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బుధవారం మున్సిపల్ ఎలక్షన్ కు పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికల కోడ్ నిబంధనల దృష్ట్యా ఫలితాల విడుదలను విద్యాశాఖ వాయిదా వేసినట్లు సమాచారం. అందుకే సోమవారం అర్ధరాత్రి ఉన్న పళంగా లింక్ ను తొలగించినట్లు సమాచారం. పోలింగ్ ప్రక్రియ తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఏ క్షణమైనా ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: DGP Shivadhar Reddy: మున్సిపోరుకు భారీ బందోబస్తు.. 3వేల మంది అదనపు బలగాలు.. డీజీపీ కీలక సూచనలు
తెలంగాణ టెట్ కు రాష్ట్రవ్యాప్తంగా 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇందులో 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. సుమారు 42,573 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఇన్-సర్వీస్ టీచర్లు అత్యధికంగా 90.27 శాతం మంది హాజరైనట్లు తెలుస్తోంది. కాగా ఈ పరీక్షలు జనవరి 3 నుంచి 20 వరకు కొనసాగాయి. టెట్ ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి 16 మధ్య విడుదలయ్యే అవకాశం ఉందని ముందుగానే అధికారులు తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఒకట్రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశముందని సమాచారం.
Also Read: Kishan Reddy: కేసీఆర్ అరెస్టును నేను ఎక్కడ అడ్డుకున్నాను? రేవంత్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న