Yadadri Power: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ(టీజీ జెన్‌కో) థర్మల్ విద్యుదుత్పత్తిని గణనీయంగా మెరుగుపరుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ రంగంపై నిర్వహిస్తున్న సమీక్షలు, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు నిరంతర పర్యవేక్షణతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు వేగవంతమయ్యాయి.
ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ఐదో యూనిట్ గ్రిడ్‌కు అనుసంధానం కావడం కీలక ముందడుగుగా నిలిచింది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల ఐదో యూనిట్‌ను అక్టోబర్ 20న విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానించారు. ప్రారంభ బొగ్గు దహన పరీక్షల్లో ఈ యూనిట్ 158.7 మెగావాట్ల గరిష్ఠ లోడ్‌ను సాధించింది. తదుపరి సన్నాహక పనుల కోసం యూనిట్‌ను తాత్కాలికంగా ట్రిప్ చేశారు. అన్ని ప్రక్రియలు పూర్తయితే నవంబర్ లో వాణిజ్య కార్యకలాపాల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ యూనిట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే యాదాద్రి కేంద్రం మొత్తం 4,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో పనిచేయనుంది.
ఇప్పటికే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన యాదాద్రి నాలుగు యూనిట్లు రాష్ట్ర గ్రిడ్‌కు రోజువారీ అవసరాలకు అనుగుణంగా 1,800 నుంచి 2,300 మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తున్నాయి. బాయిలర్, టర్బైన్, నీటి సరఫరా, బూడిద నిర్వహణ వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐదో యూనిట్ అందుబాటులోకి వస్తే రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు మరింత బలమైన ఆధారం లభించనుంది. థర్మల్ కేంద్రాల్లో నిరంతర ఉత్పత్తిని కొనసాగించేందుకు టీజీ జెన్‌కో బొగ్గు సరఫరాను విస్తరిస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి లభించే బొగ్గుతో పాటు నైనీ బొగ్గు బ్లాక్, మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి సరఫరాలను సమీకరిస్తోంది. నైనీ బ్లాక్ నుంచి రోజుకు నాలుగు నుంచి ఐదు రేకుల బొగ్గు యాదాద్రికి చేరుతోంది. శక్తి పాలసీ 2025లోని విండో II కింద ఎంసీఎల్ నుంచి కొనుగోలు చేసిన బొగ్గును తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also read: బిగ్ బాస్ 10లో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్.. మరొకరు కూడా?
వర్షాకాలంలో తడిసిన బొగ్గు కారణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడంతో పాటు బొగ్గు నిర్వహణ వ్యవస్థ(సీహెచ్‌పీ) సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సహకారంతో చేపట్టిన మరమ్మతులు, ఆధునికీకరణ పనులను అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు పూర్తయితే గంటకు 2,500 టన్నుల బొగ్గును నిర్వహించడంతో పాటు రోజుకు 12 నుంచి 14 బొగ్గు రేకులను అన్‌లోడ్ చేసే సామర్థ్యం అందుబాటులోకి రానుంది. యాదాద్రి ప్రాజెక్టు పురోగతిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీ జెన్‌కో సీఎండీ హరీశ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో జాప్యం లేకుండా రోజుకు రెండుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీజీ జెన్‌కో, బీహెచ్‌ఈఎల్, నిర్మాణ సంస్థల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రధాన కార్యాలయం, ఇతర విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి ఇంజినీరింగ్ సిబ్బందిని యాదాద్రికి తరలించి పనులను వేగవంతం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న గృహ, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని థర్మల్ కేంద్రాల నుంచి రోజుకు కనీసం 140 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని టీజీ జెన్‌కో లక్ష్యంగా పెట్టుకుంది. యాదాద్రి ఐదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తిలోకి రావడం, బొగ్గు సరఫరా మెరుగుపడటం, కోల్ హ్యాండ్లింగ్ వ్యవస్థ పటిష్ఠం కావడం ద్వారా రాష్ట్ర విద్యుత్ సరఫరాకు మరింత స్థిరత్వం చేకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను విద్యుత్ మిగులు రాష్ట్రంగా, ఇంధన భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి.
Also read: సీఎం రేవంత్ ‘విజన్ 6 మంత్ర’.. ఎమ్మెల్యే, ఎంపీలకు ఇచ్చిన టాస్క్ ఇదే?