Chilli Crops: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అటవీ ప్రాంత గ్రామాల్లో ఇప్పుడు వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చింతగుప్ప గ్రామంలో రైతులు తమ మిరప చేల వద్ద సినీ తారల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సాధారణంగా సినిమా హీరోలు, హీరోయిన్ల బర్త్డేలకో, సినిమాలకో ఫ్యాన్స్ ఫ్లెక్సీలు కట్టడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం రైతులు తమ పొలాల్లో వీటిని పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అసలు ఈ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారంటే దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. అడవి జంతువులు లేదా పక్షులను భయపెట్టడానికో కాదట! అటుగా వెళ్లే వాళ్ళ చూపు నేరుగా మిరప చేలపై పడకుండా, మొదట ఆ ఫ్లెక్సీలపై పడుతుందని.. అంటే సింపుల్గా చెప్పాలంటే తమ పంటలకు ‘దిష్టి’ తగలకుండా ఉండేందుకే ఈ పోస్టర్లు కట్టినట్లు రైతులు చెబుతున్నారు.
పంటల రక్షణ కోసం రైతులు ఎప్పుడూ ఏదో ఒక కొత్త పద్ధతిని ఫాలో అవుతుంటారు. సంప్రదాయ నమ్మకాలను నమ్ముతూ ఇలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి చింతగుప్ప గ్రామంలో మిరప చేల వద్ద కనిపిస్తున్న ఈ సినీ తారల ఫ్లెక్సీలు ఇప్పుడు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారాయి.
Also read: కార్గిల్ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా