విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ (Alluri Sitarama Raju International Airport) మరికొద్ది నెల్లల్లో ప్రయాణికులకు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రన్ వే టెస్టులో భాగంగా ఇటీవల పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా విమానంలో ఇక్కడ ల్యాండయ్యారు. అప్పటి నుంచి భోగాపురం విమానాశ్రయం పేరు మార్మోగుతోంది. ప్రజలు కూడా దీని ప్రత్యేకతలు తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఈ విమానాశ్రయాన్ని హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport)తో పోల్చుతున్నారు. మరి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, శంషాబాద్ విమానాశ్రయానికి మధ్య ఉన్న తేడా ఏమిటీ? విస్తీర్ణం ఎంత? ఎన్ని రన్ వేలు సిద్ధమవుతున్నాయి? తదితర వివరాలు మీ కోసం.
ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం చాలా చిన్నది. ఇది కేవలం డొమెస్టిక్ ఫ్లైట్లు నడిపేందుకు మాత్రమే అనువుగా ఉంది. పైగా ఇది పూర్తిగా పౌర విమానాయాన శాఖ ఆధ్వర్యంలో లేదు. ఇది నావికా దళానికి చెందిన విమానాశ్రయం. ఒకప్పుడు ఇక్కడి రన్ వే చాలా చిన్నగా ఉండేది. అయితే, 2007లో పెద్ద విమానాలు సైతం దిగేందుకు అనువుగా 3 కిమీలకు పెంచారు. అయితే A380 (ఎయిర్ బస్) వంటి అది పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా లేదు. నేవీ ఆధ్వర్యంలో ఉండటం వల్ల దీన్ని ప్రయాణికుల సౌకర్యాలకు తగినట్లుగా డెవలప్ చేయడం సాధ్యం కావడం లేదు. పైగా ఈ విమానాశ్రయం నగరం నడిబొడ్డున ఉంది. భవిష్యత్తులో ఇక్కడి ఇండస్ట్రీస్, ఐటీ, జనాభా, ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాల్సిందేనని తెలుగు దేశం ప్రభుత్వం భావించింది. కేంద్రం ఇందుకు ఆమోదం తెలపడంతో 2019 నుంచి జీఎంఆర్ సంస్థ నిర్మాణాలు చేపడుతోంది. వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొదట్లో భోగాపురం విమానాశ్రయాన్ని వ్యతిరేకించినా.. అప్పటికే కేంద్రం ఆమోదం తెలపడం, భూసేకరణ పనులు పూర్తి కావడంతో నిర్మాణాలు కొనసాగించారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో పోల్చితే.. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చాలా చిన్నది. చెప్పాలంటే శంషాబాద్ విమానాశ్రయం విస్తీర్ణంలో సగం ఉంటుంది. భోగాపురం విమానాశ్రయాన్ని 2,203 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అదనంగా మరో 500 ఎకరాలు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు. దీని విస్తీర్ణంతో పోల్చితే శంషాబాద్ విమానాశ్రయం చాలా పెద్దది. మొత్తం 5,492 ఎకరాల్లో శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించారు.
⦿ బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయం సైతం 4వేల ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది కూడా భోగాపురం విమానాశ్రయం కంటే పెద్దదే.
⦿ గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయంతో భోగాపురం ఎయిర్ పోర్ట్ సమానంగా ఉంటుంది.
జనాభా, ప్రయాణికుల సామర్థ్యం ప్రకారమే ఈ విమానాశ్రయాలను నిర్మిస్తారు. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగానే భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. నేరుగా ఇక్కడి నుంచి లాజిస్టిక్ సేవలు మెరుగవుతాయి. నేరుగా ఇక్కడి నుంచే ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి.
భోగాపురంలో రెండు రన్ వేలు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ప్రధాన రన్ వే సిద్ధమైపోయింది. విమానాలు దిగేందుకు అనువుగా ఉంది. దీని మొత్తం పొడవు 3.8 కిలో మీటర్లు (3,800 మీటర్లు). రెండో రన్ వే పొడవు ఎంతనేది ఇంకా తెలియాల్సి ఉంది.
⦿ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రెండు రన్ వేలు ఉన్నాయి. వాటిలో ఒకటి 4.43 కిమీలు (4,430 మీటర్లు), మరొకటి 4.40 కిమీలు (4,400 మీటర్లు).
⦿ శంషాబాద్‌లో ఉన్న రెండు రన్‌వేలలో ఒకటి 4.26 కిమీలు, రెండోది 3.7 కిమీలు (3,707 మీటర్లు) పొడవు ఉన్నాయి.
⦿ భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు అనువుగా భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రన్‌వేపై బోయింగ్‌తోపాటు A380 వంటి భారీ ఎయిర్ బస్సులు కూడా ల్యాండ్ కాగలవు.
⦿ విశాఖపట్నానికి సుమారు 45 కిమీల దూరంలో ఈ ఎయిర్ పోర్ట్ ఉంది. విశాఖ క్రికెట్ స్టేడియం నుంచి ఇక్కడికి 35 కిమీలు ఉంటుంది.
⦿ ఈ విమానాశ్రయాన్ని గ్రీఫ్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌గా డెవలప్ చేస్తున్నారు.
⦿ ఈ విమానాశ్రయం కోల్‌కతా, చెన్నై NH-16 హైవేను ఆనుకొని ఉంటుంది.
⦿ ఇక్కడికి మెట్రో రైళ్లను కూడా కనెక్ట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
⦿ భవిష్యత్తులో ఈ విమానాశ్రయం కార్గో హబ్‌గా సేవలు అందించనుంది.
⦿ విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్ట్, ఫార్మా వంటి పరిశ్రమలకు ఈ విమానాశ్రయం ఉపయోగపడనుంది.
⦿ అలాగే పర్యాటక రంగం అభివృద్ధికి దోహదం చేయనుంది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు నేరుగా విశాఖకు చేరుకోగలరు.
⦿ అన్నీ సక్రమంగా సాగితే 2026, జూన్ 26 నుంచి ఈ విమానాశ్రయం పౌరులకు అందుబాటులోకి రానుంది.
Also Read: అంబానీ ఇంటిని నిర్మించిన కన్‌స్ట్రక్షన్ సంస్థ ఏదో తెలుసా? నిర్మాణానికి అన్నేళ్లు పట్టిందా?