ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ఏదని అడిగితే.. వెంటనే మనం ముఖేష్ అంబానీ ఇల్లేని ఠక్కున చెప్పేస్తాం. ముంబయి వెళ్లే ప్రతి ఒక్క పర్యటకుడు ఈ ఇంటిని చూడాలని ముచ్చటపడతాడు. సుమారు 27 అంతస్తుల ఈ ఇంటిని చూస్తే తప్పకుండా కళ్లు తిరుగుతాయి. వాస్తవానికి ఈ ఇళ్లు సుమారు 60 అంతస్తుల భవనంతో సమానం. అయితే, ఒక్కో ఫ్లోర్ సీలింగ్ సాధారణ ఇళ్లకు ఉండే సీలింగ్స్ కంటే చాలా ఎత్తుగా ఉంటాయి. గదుల లోపల నుంచి విల్లాల తరహాలో ఉండే మెట్లు పైఅంతస్తులను కలుపుతాయి.
అంబానీ ఇంటిని చూసిన ప్రతి ఒక్కరికీ ఒక సందేహం కలగకమానదు. ఎందుకంటే.. అంత ఎత్తైన బిల్డింగ్ మధ్యలో భారీ ఇనుప స్తంభాల నిర్మాణాలు కూడా ఉంటాయి. ఆ అంతస్తు చాలా ఓపెన్‌గా ఉంటుంది. అక్కడే అంబానీ కుటుంబికులు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. చికాగోకు చెందిన అర్కిటెక్ట్ కంపెనీ పెర్కిన్స్ అండ్ విల్లీ, లాస్ ఎంజెలెస్‌కు చెందిన హిరిస్క్ బెండర్ అసోసియేట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భవనాన్ని డిజైన్ చేశాయి. ఆస్ట్రేలియాకు చెందిన లేటన్ హోల్డింగ్స్ సంస్థ పునాది నుంచి నిర్మాణ పనులు చేపట్టింది. మిగతా ఫినిషింగ్ వర్క్స్ మాత్రం బీఈ బిల్లిమారియా అండ్ కంపెనీ చేపట్టింది.
ముంబయిలో అత్యంత ఎక్స్‌పెన్సివ్ ఏరియాలో ఒకటైన అల్లామౌంట్ రోడ్‌లో ఈ ఇంటిని నిర్మించారు. సుమారు 173 మీటర్ల ఎత్తు, 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించారు. 2006 నుంచి నిర్మాణాలు మొదలయ్యాయి. 2010లో పూర్తయ్యాయి. అంటే సుమారు నాలుగేళ్లపాటు నిర్మాణాలు సాగాయి. ఈ భవనం 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకోగలదు. ఇల్లంతా అందమైన మార్బుల్స్‌తో.. చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఈ ఇంటి నిర్మాణానికి సుమారు రూ.15,000 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇంటి విలువ రూ.50,000 కోట్లకు పైనే ఉండవచ్చని సమాచారం. ఎందుకంటే.. ఇప్పుడు ఇక్కడి ల్యాండ్ విలువ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఒక చదరపు అడుగు స్థలం రూ.1.40 లక్షలు వరకు పలుకుతోందని సమాచారం. ఇక అంబానీ చుట్టుపక్కల స్థలాలైతే ఎంత ఖరీదు ఉంటాయో మీరే అర్థం చేసుకోవచ్చు.
అంబానీ ఇంటి పేరు ఆంటిలియా (Antilia). ఆంటిలియా అనేది పోర్చుగీసు పదం. 15వ శతాబ్దం నాటి పౌరాణిక ద్వీపానికి పెట్టిన పేరు అనే ప్రచారం ఉంది. ఈ భవనంలో మొత్తం 49 బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని గెస్ట్ రూమ్‌లు, లివింగ్ ఏరియాలు, స్పెషల్ రూమ్స్ ఉన్నాయని తెలిసింది. అయితే కచ్చితంగా ఆంటిలియాలో ఎన్ని గదులు ఉన్నాయనేది మాత్రం తెలియరాలేదు.
ఈ భవనంలోనే ఒక థియేటర్ కూడా ఉంది. ఇందులో 50 మంది కూర్చొని సినిమాలు చూడవచ్చు. ఇంకా స్వీమ్మింగ్ పూల్స్, స్పా, జీమ్, టెంపుల్, స్నో రూమ్, ఐస్ క్రీమ్ పార్లర్ ఇంకా ఒకటేమిటి.. ఆ ఇంట్లో చిన్న ప్రపంచమే ఉందని చెప్పవచ్చు. ముంబైలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు.. హెలికాప్టర్‌లో వచ్చేందుకు వీలుగా హెలిప్యాడ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఇంట్లో అంబానీ బంధువులెవ్వరూ ఉండరు. కేవలం ముఖేష్ అంబానీ ఫ్యామీలీ మాత్రమే ఉంటుంది. అయితే, ముఖేష్.. ఆయన భార్యతోపాటు పిల్లలు, మనవళ్లు మాత్రమే ఇందులో నివసిస్తున్నారు.
Also Read: యూపీఐ చెల్లింపులపై 18 శాతం ట్యాక్స్? ఇది మీరు నమ్మేశారా.. వాస్తవం ఏమిటంటే?