Walking For Heart Health: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత తీవ్రమైన వ్యాధులలో గుండె జబ్బులు ఒకటి. ప్రస్తుత మరణాలలో గుండె జబ్బులు కూడా ప్రధాన కారణం. ఇటీవలి కాలంలో ఈ వ్యాధి ప్రమాదం వేగంగా పెరుగుతోంది. యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
లైఫ్ స్టైల్ తో పాటు తినే ఆహారం ఈ ప్రాణాంతక వ్యాధి ప్రమాదాన్ని పెంచడమే కాకుండా.. వాతావరణం, పర్యావరణ పరిస్థితుల కారణంగా గుండెపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చలికాలంలో గుండెజబ్బుల కేసులు పెరుగుతాయి. ఈ ప్రమాద కారకాలను అర్థం చేసుకుని.. ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి చర్యలు తీసుకోవాలి.
క్రమం తప్పకుండా కొన్ని రకాల వ్యాయామాలు చేయడం కూడా గుండె జబ్బుల సమస్యలను తగ్గించడంలో సహాయ పడుతుందని పలు అధ్యయనాలు కనుగొన్నాయి. వాకింగ్ అలవాటు చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గణనీయంగా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రోజుకు 9,000 అడుగులు నడవాలనే లక్ష్యాన్ని సాధించడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని 30-40 శాతం తగ్గించవచ్చట.
సర్క్యులేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో.. శాస్త్రవేత్తలు రోజుకు 6,000 నుంచి 9,000 అడుగులు నడిచే వారిలో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం 40-50 శాతం తక్కువగా ఉందని తేలింది. అంతే కాకుండా ఎనిమిది అధ్యయనాలను విశ్లేషించిన బృందం, వాకింగ్ రోజువారీ లైఫ్ స్టైల్ లో చేర్చడం వల్ల గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కనుగొంది.
ఈ అధ్యయనం 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 20,152 మందిపై నిర్వహించారు. 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వారి వాకింగ్ దశలను పెంచడం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల (CVD) ప్రమాదాన్ని తగ్గించు కోవచ్చని వెల్లడైంది.
పరిశోధకులు చెబుతున్నట్లుగా, CVD అనేది సాధారణంగా వృద్ధాప్యంతో సంభవించే వ్యాధి. అధిక రక్త పోటు, ఊబకాయం, మధుమేహం వంటి ప్రమాద కారకాలు దాని ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. కానీ వాకింగ్ వల్ల గుండె పోటు ప్రమాదాన్ని నివారించవచ్చు. ఆరోగ్యకరమైన గుండె కోసం ప్రతి ఒక్కరూ రోజుకు 10,000 అడుగులు నడవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తుంది.
Also Read: డయాబెటిస్ బాధితులు చికెన్ తినొచ్చా? ఎంత మోతాదు మంచిది ?
గతంలోని అధ్యయనాలు వాకింగ్, గుండె ఆరోగ్యం మధ్య గల సంబంధాలను వెల్లడించాయి. ది లాన్సెట్‌లో ప్రచురించబడిన మార్చి 2022 అధ్యయనం ప్రకారం మీ లైఫ్ స్టైల్ లో వాకింగ్ చేర్చుకోవడం వల్ల వివిధ వ్యాధుల నుంచి అకాల మరణం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని తేలింది.
వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు:
వాకింగ్ గుండె ఆరోగ్యానికే కాకుండా మొత్తం శరీరానికి అనేక విధాలుగా ప్రయోజన కరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్ని వయసుల వారు దీన్ని ఖచ్చితంగా తమ లైఫ్ స్టైల్ లో భాగంగా చేర్చుకోవాలని చెబుతున్నారు. వాకింగ్ వల్ల గుండె ఆరోగ్యమే కాదు అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.