E-Paper
Advertisement

Aarcad Travel: తక్కువ బడ్జెట్‌లో భూలోక స్వర్గానికి చెక్కేయండి.. వేసవిలో బెస్ట్ ప్లేస్ ఎర్కాడ్

Aarcad Travel: తక్కువ బడ్జెట్‌లో భూలోక స్వర్గానికి చెక్కేయండి.. వేసవిలో బెస్ట్ ప్లేస్ ఎర్కాడ్
Advertisement

Aarcad Travel: ప్రకృతి తన చేతులతో అల్లిన ఒక పచ్చని కావ్యం.. మంచు తెరల చాటున దాగి ఉన్న ఒక అందమైన రహస్యం.. అదే ఏర్కాడ్. తమిళనాడులోని షెవరోయ్ కొండల ఒడిలో ఉన్న ఈ హిల్ స్టేషన్, సందర్శకులకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది. దక్షిణ భారత గిరిజన ప్రాంతాల రాణిగా పిలవబడే ఏర్కాడ్ సౌందర్యాన్ని ఈ వారం యాత్రలో ప్రేక్షకులకు అక్కడి అందాలను కళ్లకు కట్టేలా ఆవిష్కరిస్తున్నాం..

ప్రతి ఒక్క మలుపులో కొత్త దృశ్యాలు

తమిళనాడు రాష్ట్రంలో సముద్ర మట్టానికి 1515 మీటర్ల ఎత్తులో ఉన్న అద్భుతమైన హిల్‌ స్టేషన్ ఏర్కాడ్. దీనిని దక్షిణ భారత గిరిజన ప్రాంతాల రాణి అని పిలుస్తారు. ఏర్కాడ్‌ ఊరిలో అడుగుపెట్టగానే, కాఫీ గింజల వాసన మనకు స్వాగతం పలుకుతుంది. ఏర్కాడ్ ప్రయాణం సేలం నుండి ప్రారంభమవుతుంది. కేవలం 30 కిలోమీటర్ల దూరమే అయినా ఆ 20 హెయిర్‌పిన్ బెండ్లు దాటుతుంటే కలిగే థ్రిల్ వర్ణనాతీతం. ప్రతి మలుపులోనూ ఒక కొత్త దృశ్యం మనకు సాక్షాత్కరిస్తుంది.

దక్షిణ భారతదేశంలో ఏకైక సహజ సిద్ధమైన సరస్సు

Advertisement

తమిళనాడులోని షెవరోయ్ హిల్స్‌లో ఉన్న ఏర్కాడ్ సరస్సు .. ఈ హిల్ స్టేషన్‌కే తలమానికం. దీనిని ఎమరాల్డ్ లేక్ అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని కొండ ప్రాంతాలలో ఉన్న ఏకైక సహజ సిద్ధమైన సరస్సు. సరస్సు చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, అందమైన తోటలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఏర్కాడ్ సరస్సులో బోటింగ్ అద్భుతం. ఈ సరస్సు పక్కనే ఉన్న ఈ పార్క్ పిల్లలకు, పెద్దలకు ఒక గొప్ప విశ్రాంతి స్థలం. సరస్సు సమీపంలోనే ఉన్న జింకల పార్క్ పిల్లలకు చాలా ఇష్టమైన ప్రదేశం.

32 కిలోమీటర్ల లూవ్ రోడ్

ఏర్కాడ్ పర్యటనలో అత్యంత ఉత్సాహభరితమైన, ప్రకృతికి దగ్గరగా సాగే అనుభవం 32 కిలోమీటర్ల లూప్ రోడ్. సొంత వాహనం, టాక్సీలో వెళ్తుంటే ఈ ప్రయాణం జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది. ఈ 32 కిలోమీటర్ల రహదారి ఏర్కాడ్ సరస్సు వద్ద ప్రారంభమై, మళ్లీ అక్కడికే చేరుకుంటుంది. దారి పొడవునా ఇరువైపులా దట్టమైన సిల్వర్ ఓక్ చెట్లు, ఎత్తైన వెదురు పొదలు, పచ్చని కాఫీ తోటలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు గాలిలో కాఫీ గింజల పరిమళం, మిరియాల ఘాటు మిమ్మల్ని పలకరిస్తాయి.

పిరమిడ్ ఆకారపు రాళ్ల వింత

Advertisement

ప్రకృతి ప్రేమికులకు, ప్రశాంతతను కోరుకునే వారికి ఒక అద్భుతమైన గమ్యస్థానం ఏర్కాడ్ కొండలకు తూర్పు వైపున ఉన్న పగోడా పాయింట్. దీనిని పిరమిడ్ పాయింట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ రాళ్లను ఒకదానిపై ఒకటి పిరమిడ్ ఆకారంలో పేర్చి నిర్మించిన వింతైన కట్టడాలు కనిపిస్తాయి. ఇవి చూడటానికి బౌద్ధ దేవాలయాల వలె ఉండటం వల్ల దీనికి పగోడా పాయింట్ అనే పేరు వచ్చింది. ఈ పగోడాల మధ్యలో శ్రీరాముడికి అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం ఉంది. ప్రకృతి ఒడిలో దైవ దర్శనం చేసుకోవడం పర్యాటకులకు ఒక ప్రశాంతమైన అనుభూతినిస్తుంది. పగోడా పాయింట్ నుండి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటం ఒక మ్యాజికల్ అనుభవం. ఆకాశం రంగులు మారుతుంటే, ఆ వెలుగులో కొండలు మెరిసిపోవడం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

సాహసంతో కూడిన 200–250 మెట్ల ఆరంభ యాత్ర

ఏర్కాడ్ పర్యటనలో అత్యధికంగా ఆకర్షించే ప్రదేశం కిల్లియూర్ జలపాతం. షెవరోయ్ కొండల శ్రేణిలో భాగమైన ఈ జలపాతం, పచ్చని అడవుల మధ్య నుండి పరవళ్లు తొక్కుతూ కిందకు పడుతుంటే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. కొండ పైనుండి పాలు కుమ్మరించినట్లుగా తెల్లగా నురుగులతో పడే నీటి ధారలు చూస్తుంటే మనసు పులకరిస్తుంది. కిల్లియూర్ జలపాతాన్ని చేరుకోవడం ఒక చిన్నపాటి సాహసంతో కూడుకున్న పని. వాహనాలు నిలిపే చోటు నుండి జలపాతం వరకు సుమారు 200 నుండి 250 మెట్లు దిగాల్సి ఉంటుంది. ఈ మెట్లు కొంచెం నిటారుగా ఉంటాయి, కాబట్టి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు కాస్త శారీరక శ్రమ అవసరమవుతుంది.

మొక్కల ప్రేమికుల స్వర్గం

ఏర్కాడ్ పర్యటనలో మొక్కల ప్రేమికులకు, ప్రకృతి ఆరాధకులకు బొటానికల్ గార్డెన్ ఒక అద్భుతమైన విజ్ఞాన గని. ఏర్కాడ్ సరస్సు నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తోట, దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన వృక్షశాస్త్ర కేంద్రాలలో ఒకటి. ఈ బొటానికల్ గార్డెన్ లోపల ఉన్న ఆర్కిడారియం భారతదేశంలోనే మూడవ అతిపెద్దది. ఇక్కడ సుమారు 30 రకాల అరుదైన ఆర్కిడ్ జాతులు ఉన్నాయి, ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. వివిధ రంగులు, ఆకారాల్లో ఉండే ఈ పూలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఏర్కాడ్ బొటానికల్ గార్డెన్ యొక్క ప్రధాన ఆకర్షణ కురింజి పుష్పం. ఇది ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.

ప్రపంచంలో అతిపెద్ద 3D శ్రీ చక్ర దేవాలయం

ఏర్కాడ్‌లో ఉన్న శ్రీ చక్ర మహామేరు ఆలయం ఆధ్యాత్మికతను, అద్భుతమైన నిర్మాణ శైలిని ఇష్టపడే వారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీ చక్ర నమూనా కలిగిన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 3D పిరమిడ్ ఆకారంలో నిర్మించారు. పై నుండి చూసినప్పుడు, ఈ నిర్మాణం పవిత్రమైన శ్రీ చక్రాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత లలితా త్రిపురసుందరి. ఆమె సృష్టి, స్థితి, లయకారకురాలని భక్తుల నమ్మకం. గర్భాలయం తెల్లని పాలరాతితో నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన గొయ్యి ఉంటుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులో ఒక నాణెం వేస్తారు.

1620 మీటర్ల ఎత్తులో స్వర్గధామంగా పచ్చని కొండలు

ఏర్కాడ్ అందాలకు అసలైన చిరునామా షెవరాయ్ హిల్స్. తూర్పు కనుమలలో అంతర్భాగమైన ఈ కొండల శ్రేణిని స్థానికులు సర్వారాయన్ హిల్స్ అని పిలుస్తారు. సముద్ర మట్టానికి సుమారు 1620 మీటర్ల ఎత్తులో ఉండే ఈ కొండలు ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామం. షెవరాయ్ హిల్స్‌లోని సోలైకరడు శిఖరం ఈ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైనది. ఇక్కడి నుండి చూస్తే పచ్చని లోయలు, దట్టమైన అడవులు, దూరంగా ఉన్న గ్రామాలు ఒక అద్భుతమైన దృశ్యంలా కనిపిస్తాయి. ఈ కొండలు విస్తారమైన కాఫీ ఎస్టేట్‌లకు ప్రసిద్ధి. బ్రిటీష్ కాలం నుండి ఇక్కడ కాఫీ సాగు జరుగుతోంది. ఈ తోటల మధ్య ప్రయాణిస్తుంటే వచ్చే సువాసన మనసును రిఫ్రెష్ చేస్తుంది.

వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి దక్షిణ భారతీయులకు ఇది ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. ఇక్కడి స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్ద వాతావరణం ఒత్తిడిని దూరం చేస్తాయి. ఈ కొండల్లోని ఎత్తైన ప్రదేశంలో గిరిజన దైవమైన షెవరోయన్, కావేరి దేవి కొలువై ఉన్న ఒక పురాతన గుహాలయం ఉంది. ప్రతి ఏటా మే నెలలో జరిగే పండుగ సమయంలో వేలాది మంది గిరిజనులు ఇక్కడ సమావేశమై వేడుకలు జరుపుకుంటారు.

బ్రిటీష్ పాలన కాలపు ప్రత్యేక హ్యాంగ్‌అవుట్

ఏర్కాడ్‌లో సూర్యాస్తమయాన్ని చూడటానికి, సేలం నగరం విహంగ వీక్షణాన్ని ఆస్వాదించడానికి లేడీస్ సీట్ అత్యంత ప్రసిద్ధమైన వ్యూ పాయింట్. ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతమే కాదు, దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. బ్రిటీష్ పాలన కాలంలో ఏర్కాడ్‌లో నివసించే బ్రిటీష్ మహిళలకు ఇది ఇష్టమైన హ్యాంగ్‌అవుట్ స్పాట్. సాయంత్రం వేళల్లో వారు ఇక్కడ ఉన్న రాతి ఆసనంపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదించేవారు. అందుకే దీనికి లేడీస్ సీట్ అనే పేరు వచ్చింది. ఇక్కడి నుండి చూస్తే కింద ఉన్న మెట్టూర్ డ్యామ్, సేలం నగరం స్పష్టంగా కనిపిస్తాయి.

తక్కువ బడ్జెట్‌లో.. ఏర్కాడ్ బెస్ట్ ఛాయిస్

ఏర్కాడ్‌కు ఫ్లైట్‌లో వెళ్లాలంటే..ముందుగా ట్రిచీ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. ఇక్కడి నుంచి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఏర్కాడ్‌ సమీపంలో జోలార్‌పేట, సేలం రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏర్కాడ్‌కు వెళ్లొచ్చు. చెన్నై, కోయంబత్తూరు, బెంగుళూరు, అనేక ఇతర నగరాల నుండి ఏర్కాడ్‌కు బస్సులు, ప్రైవేటు బస్సులు వెళ్తుంటాయి. చూశారుగా..! ఏర్కాడ్ ఎంత అందంగా ఉందో. తక్కువ బడ్జెట్‌లో ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేసవి సెలవులను గడపాలనుకునే వారికి ఏర్కాడ్ బెస్ట్ ఛాయిస్.

Also Read:ముట్టుకుంటే రూ.3500 జరిమానా.. ఆ ఊరిలో వింత చట్టం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Story by: Kanugula Kishan, Big Tv

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×