Slokas For Children: పిల్లల మనస్సు తెల్లటి కాగితం లాంటిది. చిన్న వయసులోనే వారికి మంచి అలవాట్లు, సంస్కారాలను నేర్పించడం వల్ల వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. మన హిందూ సంప్రదాయంలో శ్లోకాలకు విశిష్ట స్థానం ఉంది. శ్లోకాలను పఠించడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. అంతే కాకుండా మెదడు చురుగ్గా పని చేస్తుంది. క్లిష్టమైన పదాలను పలకడం వల్ల వారి వాక్శుద్ధి మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పిల్లలతో చిన్న చిన్న శ్లోకాలు చదివించడం వారి మానసిక వికాసానికి ఎంతో తోడ్పడుతుంది.
పిల్లలకు నేర్పించాల్సిన నిత్య ప్రార్థన శ్లోకాలు:
1. నిద్రలేవగానే (కరదర్శనం):
ఉదయాన్నే కళ్ళు తెరవగానే తన అరచేతులను చూసుకుంటూ ఈ శ్లోకం చదవాలి.
శ్లోకం: “కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ | కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||”
అర్థం: హస్తం చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీ దేవి, మొదలులో పార్వతీ దేవి ఉంటారు. అందుకే ఉదయాన్నే అరచేతులను దర్శించుకోవాలి. దీని వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
2. విద్యాభ్యాసం ప్రారంభించేటప్పుడు (సరస్వతీ ప్రార్థన):
చదువుకునే ముందు ఈ శ్లోకం చదివితే ఏకాగ్రత లభిస్తుంది.
శ్లోకం: “సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||”
అర్థం: ఓ సరస్వతీ దేవి! నీకు నమస్కారం. నేను చదువు ప్రారంభిస్తున్నాను. నాకు ఎల్లప్పుడూ విజయం చేకూరేలా దీవించు. ఇది పిల్లలకు చదువు పట్ల గౌరవాన్ని కలిగిస్తుంది.
3. విఘ్నాలు తొలగడానికి (వినాయక స్తుతి):
ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని స్మరించుకోవడం మన ఆచారం.
శ్లోకం: “శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||”
అర్థం: తెల్లని వస్త్రాలు ధరించి, చంద్రుని వంటి కాంతితో, నాలుగు చేతులతో.. ప్రసన్నమైన ముఖంతో ఉన్న వినాయకుడిని అన్ని ఆటంకాలు తొలగాలని ధ్యానిస్తున్నాను.
4. గురువుపై గౌరవం (గురు శ్లోకం):
గురువుల పట్ల భక్తిని పెంచేందుకు ఈ శ్లోకం చాలా ముఖ్యం.
శ్లోకం: “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||”
అర్థం: గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు. గురువే సాక్షాత్తు పరబ్రహ్మ. అటువంటి గురువుకు నమస్కారం.
Also Read: పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
5. భోజనం చేసే ముందు (అన్నపూర్ణ స్తుతి):
ఆహారం పట్ల కృతజ్ఞతను నేర్పే శ్లోకం ఇది.
శ్లోకం: “అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే | జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ||”
అర్థం: ఓ అన్నపూర్ణమ్మ! మాకు జ్ఞానాన్ని, ఆహారాన్ని ప్రసాదించు. ఆహారాన్ని వృథా చేయకూడదనే స్పృహ దీనివల్ల పిల్లల్లో కలుగుతుంది.
శ్లోకాలు నేర్పడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జ్ఞాపకశక్తి: సంస్కృత పదాల ఉచ్చారణ వల్ల మెదడులోని కణాలు ఉత్తేజితమై జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
క్రమశిక్షణ: ఉదయం, సాయంత్రం శ్లోకాలు చదవడం వల్ల పిల్లల్లో ఒక పద్ధతి ప్రకారం జీవించడం అలవడుతుంది.
భాషా పటిమ: కష్టమైన పదాలను పలకడం వల్ల భాషపై పట్టు వస్తుంది. మాట స్పష్టంగా ఉంటుంది.
శ్లోకాలు కేవలం భక్తికి సంబంధించినవి మాత్రమే కాదు. అవి ఒక గొప్ప మానసిక వ్యాయామం. తల్లిదండ్రులు స్వయంగా పిల్లలతో కూర్చుని వీటిని నేర్పడం వల్ల వారి మధ్య అనుబంధం కూడా బలపడుతుంది. ఈ చిన్న ప్రయత్నం మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది.