Kasol Travel: పర్వత శిఖరాలు మేఘాలను ముద్దాడుతుంటే.. పచ్చని దేవదారు వృక్షాలు ఆకాశాన్ని తాకాలని చూస్తుంటే.. మంచులా చల్లని నదీ జలాలు రాళ్లను తాకుతూ సంగీతాన్ని వినిపిస్తుంటే.. ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసా? అదే కసోల్. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో.. పార్వతీ లోయలో ఒడిలో ఒదిగిపోయిన ఒక చిన్నారి గ్రామం. ఒకప్పుడు గొర్రెల కాపరులు తిరుగుతూ.. టిబెట్‌కు వెళ్లే వాణిజ్య మార్గంగా ఉన్న ఈ ప్రాంతం.. ఈరోజు ప్రపంచ పర్యాటక పటంలో ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఈరోజు మన ప్రయాణం.. ప్రకృతి ప్రేమికుల స్వర్గం, సాహస యాత్రికుల అడ్డా అయిన ఈ మినీ ఇజ్రాయిల్ వైపు..
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1,580 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న గ్రామం కసోల్. పార్వతీ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం..ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికులకు ప్రధాన కేంద్రంగా మారింది. శతాబ్దాల క్రితం ఇది కేవలం సంచార గొర్రెల కాపరులు తమ మందలతో హిమాలయాలను దాటేటప్పుడు విశ్రాంతి తీసుకునే ఒక మజిలీ మాత్రమే. ఇక్కడి స్థానిక హిమాచలీ సంస్కృతికి, బయటి ప్రపంచానికి మధ్య వంతెనగా ఈ మార్గం ఉండేది. అయితే 1970వ దశకంలో ఇక్కడో విప్లవం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిప్పీలు ఈ ప్రాంతపు నిశ్శబ్దానికి, అందానికి, ఇక్కడ లభించే ప్రశాంతతకు ముగ్ధులయ్యారు. కళాకారులు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు, ప్రకృతి ఆరాధకులు ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ఆ ప్రభావం నేటికీ కసోల్ గాలిలో కనిపిస్తుంది. అందుకే దీనిని హిప్పీల రాజధాని అని కూడా పిలుస్తారు.
కసోల్‌కు ఉన్న అతిపెద్ద గుర్తింపు మినీ ఇజ్రాయిల్. ఇక్కడికి వచ్చే పర్యాటకులలో మెజారిటీ ఇజ్రాయిల్ దేశస్థులే ఉంటారు. దీనివల్ల ఇక్కడి సంస్కృతిలో వింతైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడి దాదాపు అన్ని కేఫ్లలో ఇజ్రాయెలీ వంటకాలైన హుమ్ముస్, ఫలాఫెల్, షక్ షూకా వంటివి లభిస్తాయి. స్థానిక దుకాణదారులు కూడా కొంచెం హీబ్రూ మాట్లాడగలరు. అనేక బోర్డులు హీబ్రూ భాషలో కనిపిస్తాయి. కసోల్ ఏడాది పొడవునా చల్లని వాతావరణాన్ని కలిగి ఉంటుంది. పార్వతీ నది ఒడ్డునే ఈ గ్రామం ఉండటం వల్ల, నీటి గలగలలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. చుట్టూ దట్టమైన పైన్ అడవులు, పైన నీలి ఆకాశం, దూరంగా మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు.. ఈ దృశ్యం ఏదో పెయింటింగ్‌లా అనిపిస్తుంది.
హిమాలయాల ఒడిలో వేడినీటి బుగ్గల అద్భుతం ఖీర్‌గంగా ట్రెక్. సముద్ర మట్టానికి సుమారు 2,960 మీటర్ల ఎత్తులో ఉన్న ఖీర్‌గంగా.. ప్రకృతి ప్రేమికులకు, సాహస యాత్రికులకు ఒక కలల గమ్యస్థానం. ఇక్కడ కొండ పైన ఉండే సహజసిద్ధమైన వేడినీటి బుగ్గలు ఈ ట్రెక్ యొక్క ప్రధాన ఆకర్షణ. పురాణాల ప్రకారం.. శివుని కుమారుడైన కార్తికేయుడు ఇక్కడ వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడని చెబుతారు. తన కుమారునిపై ప్రేమతో పార్వతీ దేవి ఇక్కడ పాలను ప్రవహింపజేసిందని, అందుకే దీనికి ఖీర్‌గంగా అనే పేరు వచ్చిందని స్థానికుల నమ్మకం. ట్రెక్కింగ్ మార్గంలో రుద్రనాగ్ జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. ట్రెక్ చివరలో ఖీర్‌గంగా చేరుకున్నాక, అక్కడ ఉండే సహజ వేడినీటి గుండంలో స్నానం చేయడం వల్ల అలసట అంతా మాయమైపోతుంది. చుట్టూ మంచు కొండలు, చల్లని గాలి ఉన్నా.. ఈ నీరు మాత్రం వెచ్చగా ఉంటుంది. ఇక్కడ శివుని చిన్న ఆలయం కూడా ఉంది.
కసోల్ పర్యటనలో సందర్శించాల్సిన మరో ప్రదేశం మలానా. సముద్ర మట్టానికి సుమారు 2,652 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక చట్టాన్ని, సంస్కృతిని కలిగి ఉంది. మలానా ప్రజలు తమను తాము గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులుగా భావిస్తారు. అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు, కొంతమంది సైనికులు గాయపడి ఇక్కడే ఉండిపోయారని, వారే ఈ గ్రామాన్ని నిర్మించారని స్థానిక కథనం. అందుకే వీరి రూపం, భాష, కట్టుబాట్లు మిగిలిన హిమాచలీ ప్రజల కంటే భిన్నంగా ఉంటాయి. మలానా వెళ్లే పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే భారీ జరిమానాలు కట్టాల్సి వస్తుంది. ఇక్కడి ప్రజలను కానీ, వారి గోడలను కానీ, ఆలయాలను కానీ, చివరకు వారి వస్తువులను కానీ తాకకూడదు. వారు తమను తాము ఉన్నతమైన వారుగా భావిస్తారు. పొరపాటున తాకితే అపవిత్రం చేశారని భావించి, శుద్ధి కార్యక్రమం కోసం వెయ్యి నుండి 3 వేల 500 వరకు జరిమానా వసూలు చేస్తారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని పార్వతీ లోయ చివరన, సముద్ర మట్టానికి సుమారు 2,400 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక అందమైన కుగ్రామం తోష్. కసోల్ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామం, పర్యాటకులకు ముఖ్యంగా బ్యాక్‌ప్యాకర్లకు ఒక స్వర్గధామం.
తోష్ గ్రామం తన అద్భుతమైన వ్యూస్, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి. ఇక్కడి నుండి చూస్తే మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు చాలా దగ్గరగా కనిపిస్తాయి. తోష్ నుండి చూస్తే పిన్ పార్వతీ పాస్ కు సంబంధించిన మంచు కొండలు అద్భుతంగా కనిపిస్తాయి. ఈ గ్రామం చుట్టూ ఆపిల్ తోటలు, దేవదారు వృక్షాలు నిండి ఉంటాయి. కసోల్ లాగే తోష్‌లో కూడా అనేక రంగురంగుల కేఫ్లు ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెలీ, యూరోపియన్, భారతీయ వంటకాలు లభిస్తాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు లోయలో ప్రవహించే అత్యంత అందమైన, ఉధృతమైన నది పార్వతి నది. పార్వతి నది హిమాలయాల్లోని సుమారు 5,000 మీటర్ల ఎత్తులో ఉన్న మాంతలై సరస్సు నుండి ఉద్భవిస్తుంది. ఇది పిన్ పార్వతీ పాస్ అనే మంచు కొండల మార్గం సమీపంలో ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ నదికి శివపార్వతులతో విడదీయలేని సంబంధం ఉంది. శివుడు ఇక్కడ వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడని, పార్వతీ దేవి పేరు మీదుగానే ఈ నదికి ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. ఈ నది తీరాన ఉన్న మణికరణ్ వద్ద పార్వతీ దేవి చెవి కమ్మ నీటిలో పడిపోయిందని, దానిని వెతకడానికి శివుడు పాతాళ లోకాన్ని ఆదేశించాడని, ఆ ఉష్ణం వల్లనే అక్కడ ఇప్పటికీ వేడినీటి బుగ్గలు వస్తున్నాయని ఒక ప్రసిద్ధ గాథ ఉంది. పార్వతి నది తీరాన అనేక టెంట్ క్యాంపులు ఉంటాయి. రాత్రి వేళ నది పక్కనే క్యాంప్ ఫైర్ వేసుకుని గడపడం ఒక గొప్ప అనుభూతి. ఈ నది ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో రివర్ రాఫ్టింగ్ నిర్వహిస్తారు.
హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత కఠినమైన, సాహసంతో కూడుకున్న ట్రెకింగ్ మార్గాలలో పిన్ పార్వతి పాస్ ఒకటి. ఇది కులు లోయలోని పచ్చని పార్వతి లోయను, స్పితి లోయలోని ఎడారి లాంటి పిన్ లోయతో కలుపుతుంది. సముద్ర మట్టానికి సుమారు 5,319 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మార్గం.. కేవలం అనుభవజ్ఞులైన పర్వతారోహకులను మాత్రమే అనుమతిస్తారు. పిన్ పార్వతి గ్లేసియర్ చేరుకోవడానికి ముందు భారీ మంచు గడ్డల మీద నడవాల్సి ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం. 5,000 మీటర్ల ఎత్తులో గాలి పలచగా ఉంటుంది. కాబట్టి ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చే అవకాశం ఉంది. పార్వతి నదిని దాటడం ఇక్కడ పెద్ద సవాలు. కొన్నిచోట్ల వంతెనలు ఉండవు, తాడుల సహాయంతో నదిని దాటాలి. ఇక్కడ వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. హఠాత్తుగా మంచు తుఫానులు రావచ్చు.పిన్ పార్వతి పాస్ అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, అది మనిషి సంకల్పానికి, ప్రకృతి వైవిధ్యానికి మధ్య జరిగే ఒక గొప్ప పోరాటం. మీరు ఆకాశాన్ని తాకాలని, హిమాలయాల అసలైన గంభీరతను చూడాలని అనుకుంటే ఈ ట్రెక్ మీకు సరిగ్గా సరిపోతుంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని పార్వతీ లోయలో ఉన్న అత్యంత ప్రసిద్ధ, అందమైన ట్రెకింగ్ మార్గాలలో సార్ పాస్ ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 4,220 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మార్గం, పచ్చని అడవులు, గడ్డి భూములు, మంచుతో కప్పబడిన శిఖరాల గుండా సాగుతుంది.
ఈ ట్రెకింగ్ మార్గంలో పైన ఒక చిన్న సరస్సు ఉంటుంది. చలికాలంలో ఇది పూర్తిగా గడ్డకట్టి ఉంటుంది. ఆ సరస్సు మీదుగా వెళ్తూ ఈ కనుమను దాటాలి కాబట్టి దీనికి సార్ పాస్ అనే పేరు వచ్చింది.
కసోల్‌లో హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు ఎన్ని ఉన్నా, పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడేది నది ఒడ్డున టెంట్లలో ఉండటమే. ఇది అసలైన హిమాలయ జీవనశైలిని పరిచయం చేస్తుంది. పార్వతి నదికి ఇరువైపులా అనేక ప్రైవేట్ క్యాంపింగ్ సైట్లు ఉన్నాయి. ఇక్కడ రాత్రి వేళ చలి విపరీతంగా ఉంటుంది. అప్పుడు నది ఒడ్డున మంట వేసుకుని, సంగీతం వింటూ గడపడం మర్చిపోలేని జ్ఞాపకం. కాలుష్యం లేని ఆకాశం కావడంతో, రాత్రి వేళ వేల సంఖ్యలో నక్షత్రాలు, పాలపుంత స్పష్టంగా కనిపిస్తాయి.
రోడ్డు మార్గం ద్వారా కసోల్ వెళ్లాలనుకుంటే..ఢిల్లీ, చండీగడ్ నుంచి బస్సులు కులు, మనాలి వెళ్తుంటాయి. ఈ బస్సులను ఎక్కి..భుంతర్‌లో దిగాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి కసోల్ కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భుంతర్ నుంచి ప్రతి 30 నిమిషాలకు స్థానిక బస్సులు ఉంటాయి. కసోల్‌కు సమీపంలో చండీగడ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి కసోల్‌కు బస్సులు, ట్యాక్సీల ద్వారా వెళ్లొచ్చు. కసోల్‌కు సమీపంలో కులు-మనాలి విమానాశ్రయం ఉంది. ఇది కసోల్‌కు 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎయిర్‌పోర్టు నుంచి బస్సులు, కార్ల ద్వారా కసోల్‌కు చేరుకోవచ్చు.
కసోల్ అంటే కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు.. అది ఒక అనుభూతి. మనలోని ఆలోచనలను రీఛార్జ్ చేసుకోవాలన్నా, ప్రకృతి ఒడిలో మమేకం కావాలన్నా, హిమాలయాల అసలైన అందాలను చూడాలన్నా కసోల్ రావాల్సిందే. పార్వతీ నది గలగలలు మనసులోని అలజడిని తగ్గిస్తాయి, ఆ ఎత్తైన కొండలు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి.
Also Read: వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? బెంగళూరుకు దగ్గర్లోని ఈ అద్భుత హిల్ స్టేషన్‌ను మిస్ అవ్వకండి!
Story by: Kanugula Kishan, Big Tv