Indian Railways: పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా చర్యల్లో భాగంగా జమ్మూ, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో రాత్రిపూట రైల్వే కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమృత్ సర్, బటిండా, ఫిరోజ్ పూర్, జమ్మూతో సహా అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (LOC)కి దగ్గరగా ఉన్న ప్రాంతాలను ప్రభావితం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రిపూట ఈ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సిన రైళ్లు పగటి పూట నడిపేలా షెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు, సున్నిత ప్రాంతాల్లో నడిచే కొన్ని స్వల్ప దూర రైళ్లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. సరిహద్దు వెంబడి సైనిక కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సరిహద్దు వెంబడి మోహరించిన ఇరు దేశాల సైన్యం
పాకిస్తాన్ సరిహద్దు వెంబడి సైన్యాన్ని మోహరిస్తోంది. దాయాది సైన్యానికి ధీటుగా భారత జవాన్లు కూడా పెద్ద సంఖ్యలో సరిహద్దుల వెంబడి మోహరిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా సంసిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రైల్వే అధికారులు రైళ్ల రాకపోకల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రిపూట రైళ్లు నిలిపివేయాలని భావించారు. ఈ షెడ్యూల్ మార్పు వల్ల 15 కి పైగా రైళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించడానికి, ఈ ప్రాంతాలలో కనెక్టివిటీని కొనసాగించడానికి పగటిపూట ప్రత్యేక రైళ్లను నడపవాలని నిర్ణయించారు. ప్రస్తుత షెడ్యూల్ లలో పగటి పూట రైలు సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయన్నారు.
బ్లాక్ అవుట్ నేపథ్యంలో కీలక నిర్ణయం
రాత్రిపూట పౌర, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సరిహద్దు ప్రాంతాలలో బ్లాక్ అవుట్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి కార్యకలాపాలను నిలిపివేయాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ డ్రోన్, మిసైల్ దాడుల ప్రమాదం ఎక్కువగా ఉందని నిఘా వర్గాలు సూచిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
‘ఆపరేషన్ సిందూర్’పై డీజీఎంవో కీలక ప్రకటన
ఇక ‘ఆపరేషన్ సిందూర్’పై తాజాగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కీలక ప్రకటన చేశారు. 9 ఉగ్రస్థావరాలపై జరిగిన దాడిలో ఏకంగా 100 మంది ఉగ్రవాదాలు హతం అయినట్లు వెల్లడించారు. అటు పాక్ కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం చెప్పినట్లు తెలిపారు. పాక్ మిలటరీ ఎయిస్ బేస్ లతో పాటు పైటర్ జెట్లను కూల్చివేసినట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన పాక్ కేవలం 3 గంటల్లో ఉల్లంఘించిందని తేల్చి చెప్పారు. శత్రు దేశం భారత్ మీద దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించినా, సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు. పాక్ డ్రోన్లను ఉపయోగించి భారత గగన తలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా, భారత సైన్యం గాల్లోనే పేల్చి వేసినట్లు తెలిపారు. ఈ రోజు ఇరు దేశాలకు చెందిన డీజీఎంవోలు శాంతి చర్చలు జరపనున్నారు.
Read Also: వామ్మో.. రైలు ఇంజిన్ లైట్ ఫోకస్ అంత దూరం ఉంటుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!