Guntur to Kolkata Special Train: పండుగల సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నుంచి బెంగాల్ లోని కోల్‌కతా చిత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఫెస్టివల్ రష్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్ లోని పలు ప్రధాన స్టేషన్లను కలుపుతూ నడవనున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించాలనుకునే వారికి అదనపు రైలు సదుపాయం అందుబాటులోకి రానుంది.
రైల్వే తాజా షెడ్యూల్ ప్రకారం.. రైలు నంబర్ 07437 గుంటూరు–కోల్‌కతా చిత్‌పూర్ ప్రత్యేక రైలు అక్టోబర్ 25, నవంబర్ 1 తేదీల్లో నడుస్తుంది. ఈ రైలు గుంటూరు నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు కోల్‌కతా చిత్‌పూర్ చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రైలు దువ్వాడ స్టేషన్‌కు రాత్రి 10.20 గంటలకు చేరుకుని, రెండు నిమిషాల తర్వాత బయల్దేరుతుంది. ఈ సర్వీసు ద్వారా విశాఖపట్నం పరిసర ప్రాంతాల ప్రయాణికులకు కూడా ఉపయోగం కలగనుంది.
కోల్‌కతా నుంచి గుంటూరుకు తిరిగి రావాలనుకునే వారి కోసం రైలు నంబర్ 07438 కోల్‌కతా చిత్‌పూర్–గుంటూరు ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు అక్టోబర్ 26, నవంబర్ 2 తేదీల్లో కోల్‌కతా చిత్‌పూర్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో దువ్వాడ స్టేషన్‌కు ఉదయం 10.30 గంటలకు చేరుకుని, 10.32 గంటలకు బయలుదేరుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి. విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్ఛాపురం మీదుగా ప్రయాణిస్తాయి. అనంతరం ఒడిశాలోని బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ స్టేషన్లతో పాటు బెంగాల్ లోని ఖరగ్‌పూర్, అండుల్, దంకూని స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్టాపేజీల వల్ల మార్గంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రైలు ప్రయాణం సులభం కానుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు 19 కోచ్‌లను కలిగి ఉంటాయి. ఇందులో ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో పాటు లగేజీ, బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉంటాయి. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. ప్రయాణానికి ముందు ట్రైన్ టైమింగ్స్, స్టాపేజీలు, బెర్తుల గురించి తెలుసుకోవడం మంచిది. గుంటూరు–కోల్‌కతా మధ్య ప్రకటించిన ఈ ప్రత్యేక రైళ్లు పండుగల సమయంలో ప్రయాణికులకు అదనపు సౌకర్యాన్ని అందించనున్నాయి. ముఖ్యంగా ఏపీ నుంచి ఒడిశా, బెంగాల్ వైపు వెళ్లేవారికి ఉపయోగపడనున్నాయి.
Read Also: 24 గంటల ప్రయాణం ఇక 16 గంటల్లోనే.. రెండో వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!