Railway Lower berth: మహిళలు, వృద్ధుల విషయంలో రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్ సమయంలో మాన్యువల్ గా ఎంచుకోకపోయినా, లభ్యత ఆధారంగా సీనియర్ సిటిజన్లు, అర్హత కలిగిన మహిళా ప్రయాణికులకు లోయర్ బెర్త్ లు ఆటోమేటిక్‌గా కేటాయించబడతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారతీయ రైల్వే నడిపే సుదూర రైళ్లలో బెర్త్ కేటాయింపుపై వృద్ధ ప్రయాణికులకు కలిగే ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, గర్భిణీ స్త్రీల కోసం రైల్వే కోచ్ కు నిర్దిష్ట సంఖ్యలో లోయర్ బెర్త్ లను కేటాయించినట్లు వెల్లడించారు. ఈ మేరకు రాతపూర్వకంగా రాజ్యసభకు మంత్రి సమాధానం చెప్పారు. :
సాధారణంగా స్లీపర్ క్లాస్ కోచ్ కు 6 నుంచి 7 లోయర్ బెర్త్ లు, 3AC క్లాస్ కోచ్‌కు 4 నుంచి 5 లోయర్ బెర్త్ లు, 2AC క్లాస్ కోచ్ కు 3 నుంచి 4 లోయర్ బెర్త్ లు మహిళలు, వృద్ధులకు కేటాంచినట్లు తెలిపారు. ఈ కేటాయింపులు బుకింగ్ సమయంలో లభ్యతకు లోబడి ఆటోమేటిక్ గా బెర్త్ లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్రయాణ సమయంలో ఏవైనా లోయర్ బెర్తులు ఖాళీగా ఉంటే, సీనియర్ సిటిజన్లు, గర్భిణీ స్త్రీలు, వికలాంగులైన ప్రయాణీకులకు ప్రాధాన్యత కేటాయింపులో ఇవ్వబడుతుందన్నారు. ఒకవేళ వీరికి మిడిల్, అప్పర్ బెర్తులు కేటాయించబడి ఉన్నప్పటికీ, వారు లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంటుందన్నారు.
రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ లాంటి ప్రీమియం సర్వీసులతో సహా అన్ని మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో వికలాంగులు, వారి సహాయకులకు తప్పనిసరి రిజర్వేషన్ నిబంధనలను భారతీయ రైల్వే కొనసాగిస్తోంది.
⦿ స్లీపర్ & 3AC/3E: కోచ్‌కు 4 బెర్తులు (2 లోయర్ + 2 మిడిల్)
⦿ 2S/CC (చైర్ కార్): 4 రిజర్వు చేయబడిన సీట్లు కేటాయిస్తారు. ఈ నిబంధనలు దివ్యాంగ ప్రయాణీకులకు, వారితో ప్రయాణించే వారికి మెరుగైన యాక్సెసిబిలిటీ, ప్రయాణ సౌకర్యాన్నికల్పిస్తాయి.
వికలాంగులు, వృద్ధులైన ప్రయాణీకుల కోసం అమృత్ భారత్, వందే భారత్ లో అనేక సేవలను ప్రవేశపెట్టినట్లు రైల్వేమంత్రి వెల్లడించారు. కోచ్ లోకి వెళ్లేందుకు విశాలమైన డోర్లు, వారికి అనుకూలంగా బెర్త్ లు, వీల్ చైర్లు, వీల్ చైర్ ఫ్రెండ్లీ టాయిలెట్లు, వికలాంగులకు అనువైన గ్రాబ్ రైళ్లు, వాష్ బేసిన్లు, ప్రత్యేకమైన వీల్ చైర్ పార్కింగ్ జోన్లు, దృష్టి లోపం ఉన్న ప్రయాణీకుల కోసం బ్రెయిలీ ఎనేబుల్డ్ సైన్ నేజ్ అందుబాటులో ఉంటాయి. వందే భారత్ రైళ్లలో, మొదటి, చివరి కోచ్‌లు వీల్‌చైర్ యాక్సెస్ కు అనుకూలంగా ఉంటాయి.
దేశంలో వృద్ధాప్య ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లోయర్ బెర్తులకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్నది. ఆటోమేటెడ్ సిస్టమ్, రిజర్వ్డ్ కోటాలు లభ్యత ఆధారంగా బెర్త్ లను కేటాయిస్తున్నాయి.
Read Also: ఐదు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్!