Railway Drone Rules: రైళ్లు, వందే భారత్ ఎక్స్ ప్రెస్ వీడియోలు, అందమైన రైల్వే వంతెనలు, సొరంగాలను డ్రోన్ తో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారా? అయితే, ఇకపై జాగ్రత్తగా ఉండాలి. రైల్వే ట్రాక్‌లు, స్టేషన్లు, ఇతర రైల్వే ప్రాంతాల్లో పర్మీషన్ లేకుండా డ్రోన్లు ఎగురవేసే వారిపై భారతీయ రైల్వే సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇలాంటి పనులను కంట్రోల్ చేసేందుకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
కేరళలోని కొల్లాం ప్రాంతంలో కప్పిల్–ఎడవ రైల్వే లైన్‌పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేసిన ఘటనపై తాజాగా కోర్టు చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఒక వ్యక్తికి జరిమానా విధించడంతో పాటు ఒక రోజు సోషల్ వర్క్ శిక్ష విధించింది. ఈ పరిణామంతో రైల్వే ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగానికి సంబంధించిన నిబంధనలపై మరోసారి చర్చ మొదలైంది. రైల్వే ట్రాక్‌ల సమీపంలో డ్రోన్లు ఎగురవేయడం వల్ల రైళ్ల రాకపోకలకు, విద్యుత్ వ్యవస్థలకు, ప్రయాణికుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకే అనుమతి లేకుండా ఇలాంటి పనులు చేయకూడదని హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియా కోసం రైళ్ల వీడియోలు తీసే వ్లాగర్లు, రైల్వే అభిమానులు డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వందే భారత్ రైళ్ల ప్రయాణ దృశ్యాలు, రైల్వే వంతెనలు, సొరంగాలు, ప్రకృతి అందాల మధ్య వెళ్లే రైళ్ల వీడియోలకు మంచి ఆదరణ ఉంటుంది. అయితే, ఇలాంటి వీడియోలు తీయాలనే ఆసక్తితో రైల్వే ప్రాంతాల్లో అనుమతి లేకుండా డ్రోన్లు ఎగురవేయడం సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.
రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, నిషేధిత ప్రాంతాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించవద్దని దక్షిణ రైల్వే ప్రజలకు సూచించింది. రైల్వే ఆస్తుల దగ్గర డ్రోన్ తో ఫొటోలు, వీడియోలు తీయాలనుకునేవారు సంబంధిత అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట ప్రాంతంలో డ్రోన్ వినియోగానికి ఏ అనుమతులు అవసరమో ముందుగా తెలుసుకోవాలని వెల్లడించింది.
మొబైల్ ఫోన్‌తో సాధారణంగా ఫొటోలు, వీడియోలు తీయడం, డ్రోన్‌తో చిత్రీకరించడం రెండూ ఒకటే కాదు. రైల్వే ప్రాంగణంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీకి వర్తించే నిబంధనలు, స్థానిక పరిమితులు ఉంటాయి. డ్రోన్ వినియోగానికి అదనపు భద్రతా నిబంధనలు వర్తిస్తాయి. రైళ్లలో ప్రమాదకరంగా రీల్స్ తీయడం, నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి చిత్రీకరించడం లాంటి ఘటనలపై కూడా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో, రైళ్లు, రైల్వే వంతెనలను డ్రోన్‌తో చిత్రీకరించాలనుకునేవారు ముందుగా సంబంధిత అధికారుల అనుమతులు, వర్తించే నిబంధనలను పరిశీలించాలి. వీడియోల కోసం ప్రయాణికుల భద్రతను, తమ భద్రతను ప్రమాదంలోకి నెట్టకూడదని అధికారులు సూచించారు.
Read Also: పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!