South Korea Travel Deals: సౌత్ కొరియా ట్రిప్ కు వెళ్లాలని భావిస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించడానికి బోలెడు క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. విమాన ప్రయాణాలు, రైలు టికెట్లు, హోటల్ ఖర్చుల్లో కూడా మంచి తగ్గింపులు పొందే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కె-డ్రామా, కె-పాప్ అభిమానులకు ఇదో సూపర్ అవకాశం అని చెప్పుకోవచ్చు. అక్కడి అందమైన దేవాలయాలు, బిజీ బిజీగా ఉండే షాపింగ్ స్ట్రీట్స్, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ తక్కువ ఖర్చుతో ఆస్వాదించవచ్చు.
సౌత్ కొరియా సర్కారు ఈ ఆఫర్లను ‘స్ప్రింగ్ ఫర్ ట్రావెల్’ క్యాంపెయిన్ ద్వారా అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కొరియన్ టూరిజన్ ఆర్గనైజేషన్ అక్కడి సాంస్కృతిక శాఖ కలిసి నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 1న మొదలైన ఈ ఆఫర్లు మే 31 వరకు కొనసాగుతుంది. ఈ రెండు నెలల్లో ప్రయాణం ప్లాన్ చేస్తే ఎక్కువ ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది.
రైలు ప్రయాణం విషయంలో కూడా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. కొరియా ప్రభుత్వం నడిపే రైళ్లలో కొన్ని ప్రత్యేక మార్గాలకు 50% వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాదు, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు వెళ్లే ప్రయాణాలపై పూర్తి రీఫండ్ పాయింట్ల రూపంలో ఇచ్చే ఆఫర్ కూడా ఉంది. అంటే మీరు ప్రయాణం చేసిన తర్వాత మీ ఖర్చుకు తిరిగి పాయింట్లుగా పొందవచ్చు. ‘నైల్రో పాస్’ అనే ప్రత్యేక పాస్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది మూడు, ఐదు రోజుల పాటు రైల్లో అన్ లిమిటెడ్ గా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. అటు విమాన ప్రయాణం విషయంలో కూడా కొన్ని ఆఫర్లు ఉన్నాయి. దేశీయ విమాన టికెట్లు బుక్ చేసుకునే వారికి క్యాష్ బ్యాక్ రూపంలో పాయింట్లు ఇస్తున్నారు. చిన్న మొత్తంలో అయినా ఇది ప్రయాణ ఖర్చును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
వసతి విషయంలో కూడా మంచి తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. సియోల్, ఇంచియాన్ లాంటి ప్రధాన నగరాల హోటళ్లలో బస చేస్తే ప్రత్యేక డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. నిర్ణీత మొత్తానికి పైగా చెల్లిస్తే, కొన్ని వేల వోన్ వరకు తగ్గింపు పొందవచ్చు. మొత్తం మీద హోటల్ ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది.
ఈ ఆఫర్ల కారణంగా సౌత్ కొరియా పర్యటన ఇప్పుడు మరింత చౌకగా మారింది. ముఖ్యంగా మొదటిసారి వెళ్లాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మీరు కూడా సౌత్ కొరియా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఈ ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మంచి అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది.
Read Also: అద్భుతం.. విమానం నుంచి చూస్తే తిరుమల ఎంత అద్భుతంగా ఉందో చూడండి!