Tirumala Darshan from Sky: తిరుమల. ఈ పేరు వినగానే మనస్సులో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఏడుకొండలు, కొండలపై శ్రీవారు, నిత్యం దర్శించుకునే వేలాది భక్తులు మదిలో మెదిలిగే అదో అద్భుతం అనిపిస్తుంది. శ్రీవారిని చూసేందుకు చాలా మంది వందల కిలో మీటర్ల నుంచి తరలి వస్తారు. క్షణకాలం పాటు స్వామి వారిని చూసి మైమరచిపోతారు. అయితే, తాజాగా ఓ పైలట్ తిరుమల గురించి షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం పోస్టు చేశారంటే..
కొన్ని సంవత్సరాల క్రితం తిరుపతిలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు తాను పైలట్ అవ్వాలని కోరుకున్నట్లు చెప్పాడు. పైలెట్ అయ్యేందుకు ఏం చేయాలో తెలియకపోయినా, పైలెట్ కావాలని కలగన్నట్లు వివరించాడు. డబ్బు లేకపోయినా, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహలేకపోయినా, తన కల మీద నమ్మకంతో ప్రయాణం కొనసాగించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ కల నిజమైనట్లు చెప్పాడు. అంతేకాదు, ప్రస్తుతం పైలెట్ గా మారి తిరుమల ప్రాంతం మీదుగా విమానంలో వెల్లడం, తిరుమల పర్వతాల చుట్టూ ప్రదక్షిణ చేయగలగడం తనకు ఎంతో భావోద్వేగపూరిత మూవెంట్ గా అభివర్ణించాడు. ఇది కేవలం ఒక ఫ్లైట్ మాత్రమే కాకుండా, జీవితంలో ఒక పూర్తి వృత్తం పూర్తైనట్టుగా అనిపించిందన్నాడు. “నేను స్వామివారి చుట్టూ చేసిన ప్రదక్షిణ కాదు. ఆయనే నన్ను ఇలా ప్రదక్షిణ చేసేలా చేసినట్లు అనిపించింది” అని రాసుకొచ్చాడు.
తిరుమల మీదుగా వెళ్లే సమయంలో ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులు కూడా ఈ ఎక్స్ పీరియెన్స్ ను ఎంతో ప్రత్యేకంగా భావించినట్లు వివరించాడు. పైలట్ తిరుమల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని ప్రకటించినప్పుడు, క్యాబిన్‌లో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, ఆనంద వాతావరణం నెలకొన్నట్లు వివరించాడు. ప్రయాణికులు ఆకాశం నుంచి తిరుమల పర్వతాలను దర్శించడం ద్వారా పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిదిగా ఉందన్నాడు. ముఖ్యంగా ద్వారకాధీశ్ నుంచి చెన్నైకి వెళ్తున్న ఈ ప్రయాణికులకు ఆ క్షణంలో మరింత ఆధ్యాత్మిక అనుభూతిని పొందినట్లు వివరించాడు.
తిరుమల మీదుగా విమానం వెళ్తున్న సమయంలో ఓ ప్రయాణీకుడు తీసిన వీడియోను ఫ్లైట్ కెప్టెన్ మన్ జీత్ సింగ్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించాడు. తిరుపతి విమానాశ్రయం పరిసర గగనతలం పూర్తిగా నిషేధిత ప్రాంతం కాకపోయినా, సాధారణంగా మతపరమైన భావాలను గౌరవిస్తూ, భక్తుల భద్రత దృష్ట్యా కమర్షియల్ విమానాలు ఆలయం మీదుగా నేరుగా ప్రయాణించడాన్ని నిషేధించారు. ఈ ప్లైట్ ప్రత్యేక ప్రదక్షిణ కోసం అవసరమైన అన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అనుమతులు తీసుకున్నట్లు వెల్లడించాడు. విమానం సుమారు 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణించిందని, అలాగే ఆలయానికి సురక్షిత దూరాన్ని కచ్చితంగా పాటించినట్లు వెల్లడించారు. వీడియోలో కూడా విమానం ఎక్కడా ఆలయం పైగా నేరుగా ప్రయాణించలేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటన ఒక పైలట్ వ్యక్తిగత కల ఎలా నిజమైందో చూపించడమే కాకుండా, ప్రయాణికులకు కూడా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది.
Read Also: వేసవిలో భూటాన్ ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి? ఖర్చు ఎంత?