Lascaux Cave Mystery: ఓ వేసవి మధ్యాహ్నం.. ఒక కుక్క పరిగెడుతూ వెళ్లి భూమిలో ఉన్న రంధ్రంలోకి పొరపాటున జారిపడింది. దానిని వెతుక్కుంటూ 15 ఏళ్ల కుర్రాడు వెళ్లగా.. ప్రపంచమే ఆశ్చర్యపడే కళాఖండాలు అతడి కంటపడ్డాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. 1940 సెప్టెంబర్ లో ఈ అద్భుతం నిజంగానే జరిగింది. ఫ్రాన్స్‌లోని మోంటిన్యాక్ గ్రామంలో మార్సెల్ రావిడాట్ అనే యువకుడు కుక్కను కాపాడే క్రమంలో ఏకంగా ఓ గుహనే కనుగొన్నాడు. అదే ప్రపంచ ప్రసిద్ధ లాస్కాక్స్ (Lascaux) గుహ. అది నేటికి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ అబ్బురపరుస్తోంది.
మొదటిసారిగా గుహలోకి ప్రవేశించిన 15 ఏళ్ల రావిడాట్, తన స్నేహితులతో కలిసి చిన్న దీపం వెలుగులో లోపలికి ప్రవేశించాడు. అక్కడ రాతి గోడలపై కనిపిస్తున్న బొమ్మలను చూసి వారంతా నోరెళ్లబెట్టారు. ఈ గుహ గురించి విస్తృతంగా ప్రచారం మెుదలుకావడంతో ఆర్కియాలజీ పరిశోధకులు రంగంలోకి దిగారు. ఆ గుహ గోడలపై ఉన్న చిత్రాలు ఏకంగా 17,000 సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన మానవులు గీసిన చిత్రాలని వారు తేల్చారు.
గుహ గోడలపై గుర్రాలు, ఎద్దులు, దుప్పులు, కనుమరుగైన జీవుల రూపాలు రంగురంగుల్లో ఎంతో జీవకళతో ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఆది మానవుల కాలం నాటి అత్యంత పురాతనమైన, శ్రేష్టమైన చిత్రలేఖనంగా వీటికి గుర్తింపునిచ్చారు. ఈ క్రమంలోనే ఈ గుహను పరిశోధకులు ‘ప్రాచీన మానవుల సిస్టైన్ ఛాపెల్’ అని అభివర్ణించారు.
దాదాపు 771 అడుగుల పొడవున్న ఈ భారీ గుహలో దాదాపు 680 చిత్రాలతో పాటు 1,500 కంటే ఎక్కువ రాతి చెక్కడాలు ఉన్నాయి. కొన్ని జంతువుల బొమ్మలు ఏకంగా ఆరు అడుగుల పొడవుండటం విశేషం. అప్పట్లోనే నేలబొగ్గు, ఐరన్ ఆక్సైడ్ వంటి సహజ రంగులను ఉపయోగించి తాత్కాలిక నిచ్చెనలతో పైకప్పులపై ఈ అద్భుతాలను చెక్కారు. అసలు అక్షర జ్ఞానమే లేని కాలంలోనే మానవుడికి కళ పట్ల ఉన్న ప్రావీణ్యానికి ఈ గుహలు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి.
లస్కాక్స్ గుహ ప్రాచుర్యం పొందాక.. 1948 నుండి పర్యాటకులకు అనుమతి ఇచ్చారు. రోజుకు వేల సంఖ్యలో వచ్చిన సందర్శకుల ఊపిరి, శరీర వేడి, తేమ కారణంగా గుహ గోడల వాతావరణం దెబ్బతింది. చిత్రాలపై ఆల్గే (పాచి), ప్రమాదకరమైన బూజు వ్యాపించడం ప్రారంభమైంది. పరిస్థితి చేయి దాటిపోవడంతో 1963లో ఈ గుహలోకి సాధారణ పర్యాటకుల రాకపోకలను శాశ్వతంగా నిషేధించారు. ప్రస్తుతం ఇది శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనలకు మాత్రమే పరిమితమైన ఒక సురక్షిత సంరక్షణ కేంద్రంగా మారింది.
Also Read: అడవిలో పారేసిన 12 టన్నుల నారింజ వ్యర్థాలు.. 15 ఏళ్ల తర్వాత జరిగింది చూసి.. యావత్ ప్రపంచమే షాక్!
అయితే అసలైన గుహను మూసివేసినప్పటికీ ఆ కళాత్మక సంపదను ప్రపంచానికి అందించేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం వినూత్న మార్గాలను ఎంచుకుంది. 3D టెక్నాలజీ, అధునాతన ఆడియో సిస్టమ్‌ల సహాయంతో అసలైన గుహను ఉన్నది ఉన్నట్లుగా ప్రతిబింబించే రీతిలో ‘లస్కాక్స్ IV’ (Lascaux IV) పేరిట ఒక భారీ ప్రదర్శనశాలను అందుబాటులోకి తెచ్చింది. దీనిని వీక్షించడం ద్వారా నిజమైన గుహలోనే తిరుగుతున్నామనే భావన పర్యాటకులకు కలుగుతోంది.
Also Read: ఆహా.. Viలో ఇంతటి సూపర్ ప్లాన్ ఉందా? జస్ట్ రూ.349కే అపరిమిత 5G, ఫ్రీ కాల్స్!