Nagarjuna Sagar New Adventure Experience: నాగార్జునసాగర్‌కు వచ్చే పర్యాటకులు మరో అడ్వెంచర్ ఎక్స్ పీరియెన్స్ పొందే అవకాశం అందుబాటులోకి రాబోతోంది. సాగర్‌కు సమీపంలోని పల్నాడు జిల్లా పరిధిలో ఉన్న ఎత్తిపోతల జలపాతం దగ్గర అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహించేలా కొత్త ఏర్పాట్లు చేశారు. జలపాతం అందాలను ఆస్వాదించడంతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్అనుభూతిని పొందే అవకాశం ఇకపై పర్యాటకులకు లభించనుంది.
ఎత్తిపోతల జలపాతం దగ్గర జిప్‌లైన్, జిప్ సైక్లింగ్ ఏర్పాటు కోసం ఏపీ సర్కారు సుమారు రూ.1.71 కోట్లను వెచ్చించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, అమరావతికి చెందిన రెయిన్‌బో ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. సదుపాయాల ఏర్పాట్లు పూర్తికావడంతో నిర్వాహకులు ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందులో కొందరు పర్యాటకులు పాల్గొని కొత్త అనుభూతిని ఆస్వాదించారు. ఈ నెల 9వ తేదీ నుంచి జిప్‌లైన్, జిప్ సైక్లింగ్‌ను అధికారికంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఎత్తిపోతల జలపాతం ప్రకృతి అందాలను పై నుంచి చూసే అవకాశం జిప్‌లైన్ ద్వారా లభిస్తుంది. దాదాపు 100 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ జలపాతం, చుట్టుపక్కల ప్రాంతాల అందాలను చూసే అవకాశం ఉంటుంది. సాధారణంగా జలపాతాన్ని కింద నుంచి చూస్తే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అయితే, గాల్లో ముందుకు సాగుతున్న సమయంలో కనిపించే దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ఇష్టపడేవారికి ఈ కొత్త సదుపాయం మరింతగా ఆకట్టుకోనుంది.
జిప్ సైక్లింగ్ ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేక ఆకర్షణ. ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన మార్గంపై సైకిల్ తొక్కుతూ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. నేలపై సైకిల్ తొక్కడం సాధారణమే అయినా.. గాల్లో ఎత్తులో సైకిల్ ప్రయాణం చేయడం మాత్రం పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. జిప్‌లైన్ మార్గం సుమారు 260 మీటర్ల పొడవు ఉంటుంది. వెళ్లి తిరిగి రావడానికి దాదాపు రెండు నిమిషాల సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఒకేసారి ఇద్దరు వ్యక్తులు వెళ్లొచ్చు.
జిప్‌లైన్, జిప్ సైక్లింగ్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటే ఒక్కొక్కరికి రూ.600 చెల్లించాలి. రెండూ కావాలంటే రూ.1,000 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. పర్యాటకుల సంఖ్య పెరిగితే సమయాన్ని మరో గంట పొడిగించే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్పారు.
ఎత్తిపోతల జలపాతం, నాగార్జునసాగర్ సమీపంలో ఉండటంతో కొత్త అడ్వెంచర్ టూరిజం సదుపాయాలు సాగర్ పర్యాటక రంగానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జలపాతం చూసేందుకు వచ్చే వారిలో మరికొందరు నాగార్జునసాగర్‌ను కూడా సందర్శించే అవకాశం ఉంది.
Read Also: నాగార్జునసాగర్ లో రంగు మారుతున్న నీళ్లు, అసలేం జరుగుతోంది?