Orange Waste: 1990ల కాలంలో లాటిన్ అమెరికా దేశమైన కోస్టారికాలో ‘ఏరియా డి కాన్సర్వేషన్ గువానాకాస్టే’ రక్షిత అటవీ ప్రాంతం సమీపంలో ‘డెల్ ఓరో’ అనే ఆరెంజ్ జ్యూస్ కంపెనీ పనిచేసేది. జ్యూస్ తయారీ తర్వాత మిగిలిపోయే టన్నుల కొద్దీ తొక్కలు, గుజ్జును పారబోయడం అప్పట్లో ఆ కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలో డానియెల్ జాన్జెన్, విన్నీ హాల్‌వాక్స్ అనే ఇద్దరు పర్యావరణవేత్తలకు ఒక వినూత్న ఆలోచన వచ్చింది. వ్యర్థాలను పారేయడం కంటే, పశువుల మేత, తరచుగా సంభవించే కార్చిచ్చుల వల్ల దెబ్బతిన్న అటవీ భూమిని తిరిగి సారవంతం చేయడానికి వీటిని ఉపయోగించవచ్చని వారు భావించారు.
రాళ్లతో, సారం లేని మట్టితో నిండి ఉన్న కోస్టారికా అటవీ ప్రాంతాల్లోని కొన్ని భూభాగాలను తిరిగి పునరుద్ధరించేందుకు డెల్ ఓరో కంపెనీతో పర్యావరణ వేత్తలు ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం కంపెనీ తనకు చెందిన కొంత అటవీ భూమిని సంరక్షణ ప్రాంతానికి విరాళంగా ఇచ్చి ఆరెంజ్ వ్యర్థాలను ఈ పాడైపోయిన భూమిలో వేయడానికి అనుమతి పొందింది. అలా 1998లో సుమారు 12,000 మెట్రిక్ టన్నుల ఆరెంజ్ తొక్కలను అక్కడ పారబోశారు. ఈ వ్యర్థాలు కుళ్ళిపోయినప్పుడు వాటిలోని సేంద్రీయ పదార్థాలు, పోషకాలు మట్టిలో కలసి భూమి సారాన్ని పెంచాయి.
అయితే ఈ వినూత్న ప్రయోగం ఎక్కువ కాలం సాగలేదు. ‘టికోఫ్రూట్’ అనే ప్రత్యర్థి జ్యూస్ కంపెనీ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ వివాదం కోస్టారికా సుప్రీంకోర్టుకు చేరగా కోర్టు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీంతో ప్రయోగం అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో అప్పటివరకూ పెద్ద మొత్తంలో ఆరెంజ్ తొక్కలు పేరుకుపోయిన ఆ ప్రాంతాన్ని అందరూ మరిచిపోయారు. అది ఎలాంటి రూపం దాలుస్తుందో ఎవరికీ తెలియకుండా ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి.
సుమారు 15 ఏళ్ల తర్వాత అంటే 2013లో ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు తిమోతీ ట్రూయర్.. జాన్జెన్‌తో మాట్లాడిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని నిశ్చయించుకున్నారు. అక్కడికి వెళ్లిన పరిశోధకులకు ఊహించని దృశ్యం కనిపించింది. ఒకప్పుడు ఎడారిలా ఎండిపోయిన ఆ భూమి, దట్టమైన చెట్లు, తీగలతో నడవడానికి కూడా వీలులేని విధంగా దట్టమైన అడవిగా మారిపోయింది. ఆఖరికి ప్రయోగ స్థలాన్ని గుర్తించే బోర్డు కూడా చెట్ల మధ్య చిక్కుకుపోవడం విశేషం.
Also Read: ఆహా.. Viలో ఇంతటి సూపర్ ప్లాన్ ఉందా? జస్ట్ రూ.349కే అపరిమిత 5G, ఫ్రీ కాల్స్!
అయితే ఆరెంజ్ తొక్కలు వేయని పక్క భూమితో పోల్చి చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వ్యర్థాలు వేసిన ప్రాంతంలో మట్టి సారవంతంగా మారడమే కాకుండా, చెట్ల రకాలు, మొక్కల పెరిగిన తీరు (బయోమాస్) 176 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. శాస్త్రవేత్త తిమోతీ ట్రూయర్ దీనిని తక్కువ ఖర్చుతో సాధించిన అరుదైన ఘనతగా అభివర్ణించారు. వ్యర్థాలుగా భావించే వాటిని సరిగ్గా ఉపయోగిస్తే అడవుల పునరుద్ధరణకు మొక్కలు నాటడమే కాకుండా ఇలాంటి వినూత్న మార్గాలు కూడా పనిచేస్తాయని ఈ ప్రయోగం నిరూపించింది.
Also Read: నాగార్జునసాగర్ లో రంగు మారుతున్న నీళ్లు, అసలేం జరుగుతోంది?