Female Animals: అడవుల నుంచి సముద్ర గర్భం వరకు జీవుల మనుగడ కేవలం పరిమాణం, బలంపైనే కాకుండా తెలివి తేటలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆడ జీవులు.. తమను తాము కాపాడుకోవడానికి, సంతానాన్ని రక్షించుకోవడంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ అడవుల నుంచి పసిఫిక్ మహా సముద్రం లోతుల వరకూ అత్యంత తెలివైన, వ్యూహాలతో ఆధిపత్యం చెలాయిస్తున్న 5 ఆడ జీవుల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ప్రపంచంలోనే అత్యంత బరువైన పాముగా గుర్తింపు పొందిన గ్రీన్ అనకొండ (Eunectes murinus) ఆడ జీవి బరువు దాదాపు 200 కిలోలపైనే ఉంటుంది. పొడవు ఆరు మీటర్లకు పైగా ఉండనుంది. సంతానోత్పత్తి సమయంలో అనేక మగ పాములు దీనిపై దాడి చేస్తుంటాయి. దీంతో శక్తి కోసం మగ పాముల్లో ఒకదానిని లేదా అంతకంటే ఎక్కువ పాములను ఇది ఆహారంగా తీసుకుంటుంది.
కీటకాల ప్రపంచంలో ప్రయేయింగ్ మ్యాంటిస్ (Tenodera sinensis) ఆడ జీవి అత్యంత ప్రమాదకరమైనది. కలయిక సమయంలో లేదా ఆ తర్వాత ఇది మగ పురుగు తలను కొరికి తింటుంది. ఆ తర్వాత మిగిలిన శరీరాన్ని కూడా ఆహారంగా మార్చుకుంటుంది. మగ జీవిని తినడం వల్ల లభించే పోషకాలు ఆడ పురుగు గుడ్లు పెట్టడానికి, పిల్లల మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని పరిశోధనల్లో తేలింది.
చిన్నగా, అమాయకంగా కనిపించే మీర్కాట్లు (Suricata suricatta) గుంపులోని ఆడ మీర్కాట్ (ఆల్ఫా ఫిమేల్) ఇతర ఆడ జీవులపై ఆధిపత్యం చెలాయిస్తుంది. తన గుంపులో వేరే ఏ ఆడ జీవి పిల్లలకు జన్మనిచ్చినా ఆ పిల్లలను చంపేస్తుంది. నియమాలను ధిక్కరించే జీవులను గుంపు నుంచి తోసివేస్తుంది. తన సంతానానికి మాత్రమే ప్రాధాన్యత దక్కేలా, గుంపు మొత్తం తన పిల్లల సంరక్షణకే పనిచేసేలా ఇది చూసుకుంటుంది.
చింపాంజీల తరహాలోనే కనిపించే బొనోబో (Pan paniscus) జాతిలో ఆడ జీవులదే పైచేయి. మగ జీవుల దాడులను అరికట్టడానికి ఆడ బొనోబోలు ఒక బలమైన కూటమిగా ఏర్పడతాయి. మగ జీవులు పరిమాణంలో పెద్దవిగా ఉన్నప్పటికీ, ఆడ జీవుల ఐక్యత ముందు లొంగిపోక తప్పదు. శారీరక బలం కంటే గుంపుగా ఏర్పడే శక్తితో కూడా ఆధిపత్యాన్ని సాధించవచ్చని ఇవి నిరూపిస్తున్నాయి.
అడవికి రాజుగా మగ సింహాన్ని పిలిచినప్పటికీ గుంపు మనుగడకు అసలైన ఆధారం ఆడ సింహాలే (Panthera leo). ఆహారం కోసం వేటాడే బాధ్యతనంతా ఇవే తీసుకుంటాయి. జింకలు, జెబ్రాలు వంటి పెద్ద జంతువులను వేటాడేందుకు ఇవి ఒక వ్యూహం ప్రకారం బృందాలుగా దాడి చేస్తాయి. పరస్పరం సమాచారం మార్పిడి చేసుకుంటూ అత్యంత ఖచ్చితత్వంతో వేటను పూర్తి చేస్తాయి. గుంపునకు ఆహారాన్ని అందించడంతో పాటు రక్షణ బాధ్యతలను ఇవే చూసుకుంటాయి.
పక్షుల జాతిలో స్పారోహాక్ (Accipitation nisus) ఆడ పక్షి ప్రత్యేకమైనది. ఇవి మగ పక్షుల కంటే దాదాపు మూడో వంతు పెద్దవిగా, బలంగా ఉంటాయి. దీనివల్ల ఇవి పెద్ద పక్షులను కూడా సులువుగా వేటాడగలవు. గుడ్లను పొదిగే సమయంలో మగ పక్షి తెచ్చే ఆహారంపై ఇవి ఆధారపడినప్పటికీ.. పిల్లలు బయటకు రాగానే మళ్లీ భయంకరమైన వేటగాడిగా మారుతుంది. తన పరిధిలోని చిన్న పక్షుల జనాభాను నియంత్రిస్తూ పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: చిరుతను ఢీకొట్టిన కారు.. సాయం కోసం వచ్చిన అధికారిపై దాడి చేసిన క్రూరమృగం.. షాకింగ్ వీడియో!
చీకటిగా ఉండే సముద్రాల లోతుల్లో నివసించే ఆడ అంగ్లర్‌ఫిష్ (Melanocetus johnsonii) రూపం అత్యంత విచిత్రంగా ఉంటుంది. దీని తలపై వెలిగే ఒక చిన్న అవయవం ఆహారాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ జాతిలో మగ జీవులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి కేవలం స్త్రీల ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకాకుండా మగ జీవి ఆడ జీవి శరీరానికి అతుక్కుపోయి క్రమంగా దాని శరీరంలో ఒక భాగంగా మారిపోతుంది. దానికి బదులుగా ఆడ జీవి నుంచి పోషకాలను పొందుతుంది.
Also Read:పరీక్షల్లో 95.7 శాతం మార్కులు.. అయినా స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?