Student Suicide: 12వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఓ విద్యార్థి.. కోరుకున్న కాలేజీలో సీటు రాలేదని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని థానే నగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విద్యార్థి కుటుంబ సభ్యులను తీరని శోకాన్ని మిగిల్చింది.
థానేలోని ఘోడ్‌బందర్ రోడ్‌లో ఉన్న హీరానందని ఎస్టేట్ లో ఉంటున్న 17 ఏళ్ల యువకుడు ఇటీవల జరిగిన 12వ తరగతి పరీక్షల్లో 95.7 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ (IIEST) లో బీఎస్-ఎంఎస్ (BS-MS) డ్యూయల్ డిగ్రీ చేయాలనేది యువకుడి కల. కాగా, ఇటీవల వెలువడిన అప్టిట్యూడ్ టెస్టులో 10,474 ర్యాంక్ రావడంతో కోరుకున్న కోర్సులో విద్యార్థికి సీటు దక్కలేదు. దీంతో అతడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు.
ఈ క్రమంలోనే సెప్టెంబరు 4వ తేదీ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో సైకిల్ తొక్కుతానని ఇంట్లో చెప్పి సదరు విద్యార్థి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన కాసేపటికే అంటే రాత్రి 8:15 గంటల సమయంలో తన కుటుంబ వాట్సాప్ గ్రూప్‌లో ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఒక మెసేజ్ పెట్టాడు. అది చూసి తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. వెంటనే అతనికి ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆలస్యం చేయకుండా కాసర్వడవలి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు, కుటుంబ సభ్యులు కలిసి అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో యువకుడి కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే భవనం 22వ అంతస్తులోని ‘రిఫ్యూజ్ ఏరియా’ నుంచి అతడు కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిఉన్న యువకుడ్ని వెంటనే థానే సివిల్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Also Read: భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?
తమ బిడ్డ ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు తమకు లేవని యువకుడి తండ్రి పేర్కొన్నారు. ఆశించిన కాలేజీలో సీటు రాకపోవడమే ఈ దారుణానికి కారణమని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తండ్రి తెలియజేశారు. మరోవైపు ఘటనపై అనమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!