Leopard Attack: కర్ణాటకలోని దావణగెరె సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై కారు ఢీకొనడంతో చిరుతపులి తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది.. చిరుతకు చికిత్స అందించేందుకు హుటాహుటీనా అక్కడికి చేరుకోగా.. అనూహ్యంగా చిరుత వారిపై దాడి చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రెస్క్యూ ప్రక్రియలో భాగంగా అధికారులు తొలుత చిరుతకు మత్తు మందు ఇచ్చారు. అయితే ఆ మత్తు మందు సరిగా ఎక్కకపోవడం, అప్పటికే తీవ్ర ఒత్తిడితో ఉండటం వల్ల చిరుత ఒక్కసారిగా లేచి అక్కడే ఉన్న ఓ అటవీ శాఖ అధికారిపైకి దూకింది. క్షణాల వ్యవధిలోనే అధికారిని కిందకు పడేసి.. దాడి చేసింది. దీంతో అక్కడి వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
🚨 Injured leopard attacks forest official during rescue operation in Karnataka pic.twitter.com/D7dmKp75uD
— India Live (@IndiaLiveIN) September 8, 2026
అధికారిపై చిరుత దాడికి తెగబడటంతో తోటి సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. చేతిలో ఉన్న కర్రలతో చిరుత దృష్టిని మరల్చడానికి ప్రయత్నించారు. దీంతో ఆ చిరుత అధికారిని వదిలేసి పక్కకు వెళ్లింది. దీంతో గాయపడిన అధికారి వెంటనే తేరుకుని పైకి లేవగా చిరుత నెమ్మదిగా పాకుతూ రహదారి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత అటవీ అధికారులు ఎంతో శ్రమించి చిరుతను బంధించి, వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిరుతకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: పరీక్షల్లో 95.7 శాతం మార్కులు.. అయినా స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?
మరోవైపు చిరుత దాడి, అధికారుల రెస్క్యూ ఆపరేషన్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మనుషుల స్వార్థం, విస్తరిస్తున్న మౌలిక వసతుల వల్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని పలువురు వాపోతున్నారు. చిరుతను ఢీకొట్టి వెళ్లిపోయిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు. రెస్క్యూ సమయంలో అటవీ శాఖ సిబ్బందికి సరైన భద్రతా పరికరాలు, తగిన శిక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి గందరగోళం నెలకొంటోందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
Also Read: శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!