Visakhapatnam Special Trains Extended: పండుగలు, ఇతర అవసరాల కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్లపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను మరికొన్ని వారాల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. విశాఖపట్నం, బెంగళూరు, భువనేశ్వర్, షాలిమార్, చర్లపల్లి వంటి ప్రధాన మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లకు అదనపు ట్రిప్పులను ప్రకటించింది.
రైలు నంబర్ 02811 భువనేశ్వర్–యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలును జూలై 4 నుంచి ఆగస్టు 29 వరకు ప్రతి శనివారం మొత్తం 9 అదనపు ట్రిప్పులు నడపనున్నారు. అలాగే 02812 యశ్వంత్‌పూర్–భువనేశ్వర్ ప్రత్యేక రైలును జూలై 6 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతి సోమవారం 9 అదనపు ట్రిప్పులతో కొనసాగించనున్నారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి మరింత సౌకర్యం లభించనుంది.
విశాఖపట్నం నుంచి ఎస్ఎమ్‌విటి బెంగళూరుకు వెళ్లే 08581 ప్రత్యేక రైలును జూలై 3 నుంచి జూలై 31 వరకు ప్రతి శుక్రవారం 5 అదనపు ట్రిప్పులతో పొడిగించారు. తిరుగు ప్రయాణంలో 08582 ఎస్ఎమ్‌విటి బెంగళూరు–విశాఖపట్నం ప్రత్యేక రైలు కూడా జూలై 3 నుంచి ఆగస్టు 1 వరకు 5 అదనపు ట్రిప్పులు నడవనుంది. బెంగళూరులో ఉద్యోగాలు, విద్య కోసం వెళ్లే ప్రయాణికులకు ఇది ఉపయోగపడుతుంది.
తూర్పు భారతం నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికుల కోసం 08045 షాలిమార్–చర్లపల్లి ప్రత్యేక రైలును జూలై 17 నుంచి జూలై 31 వరకు ప్రతి శుక్రవారం 5 అదనపు ట్రిప్పులతో కొనసాగించనున్నారు. అదేవిధంగా 08046 చర్లపల్లి–షాలిమార్ ప్రత్యేక రైలు జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు 5 అదనపు ట్రిప్పులతో అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రత్యేక రైళ్ల పొడిగింపుతో విశాఖపట్నం, బెంగళూరు, భువనేశ్వర్, షాలిమార్, చర్లపల్లి ప్రాంతాల మధ్య ప్రయాణించే వారికి టికెట్లు పొందడం కొంత సులభం కానుంది. ముఖ్యంగా సెలవులు, కుటుంబ కార్యక్రమాలు, ఉద్యోగ అవసరాల కోసం ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఊరట కలిగించే అవకాశముంది. ప్రత్యేక రైళ్లు నడుస్తున్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలకు అనుగుణంగా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. రైల్వే శాఖ ప్రకటించిన ఈ అదనపు సర్వీసులు రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి.
Read Also: సెల్ఫీ దిగండి.. ఫ్రైజ్ గెలవండి.. సౌత్ సెంట్రల్ రైల్వే బంపర్ ఆఫర్!