Hyderabad–Tirupati Flights: హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే విమానాల్లో గత కొద్ది రోజులుగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఉదయం తిరుపతికి చేరుకునే విమానాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం తిరుపతి విమానాశ్రయంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవాణి టికెట్ కౌంటర్. ఈ టిక్కెట్ల కోసం ఉదయాన్నే రేణిగుంట చేరుకుంటున్నారు.
భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతి విమానాశ్రయంలో టీటీడీ శ్రీవాణి కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్‌లో ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో ఉదయం తిరుపతికి చేరుకునే ప్రయాణికులకు అదే రోజు టికెట్లు పొందే అవకాశం లభిస్తోంది. మొదట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే శ్రీవాణి టికెట్లు అందుబాటులో ఉండేవి. కానీ, ప్రయాణికుల సంఖ్య పెరగడంతో టీటీడీ రోజుకు అదనంగా 200 టికెట్లను జారీ చేయడం ప్రారంభించింది. దీంతో మరింత మంది భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం పొందుతున్నారు.
హైదరాబాద్ నుంచి తిరుపతికి రోజుకు దాదాపు ఎనిమిది విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అయితే ఉదయం 7:20 గంటలకు తిరుపతికి చేరుకునే ఇండిగో విమానం, 8:30 గంటలకు చేరుకునే ఎయిర్ ఇండియా విమానాలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ఈ రెండు సర్వీసుల్లో ప్రయాణించే భక్తులే ఎక్కువగా శ్రీవాణి టికెట్లు పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాత తిరుపతికి చేరుకునే విమానాల్లో వచ్చే ప్రయాణికులకు శ్రీవాణి టికెట్లు దొరకడం కష్టమవుతోంది. కౌంటర్ నిర్ణీత సమయం వరకు మాత్రమే పనిచేయడం వల్ల ఉదయం విమానాల్లో వచ్చే వారికే ఎక్కువ అవకాశం లభిస్తోంది. దీంతో చాలా మంది భక్తులు తమ ప్రయాణాన్ని ఉదయం విమానాలకు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు.
ఉదయం విమానాలకు డిమాండ్ పెరగడంతో టికెట్ ధరలు కూడా భారీగా పెరిగాయి. బుధవారం హైదరాబాద్–తిరుపతి ఇండిగో విమాన టికెట్ ధర సుమారు రూ.15,905 వరకు ఉండగా, ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధర రూ.11,905 వరకు నమోదైంది. సాధారణ రోజులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
టీటీడీ నిర్వహించే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రత్యేక దర్శనం కల్పించే విధానమే శ్రీవాణి టికెట్. ఒక్కో టికెట్‌కు మొత్తం రూ.10,500 చెల్లించాలి. ఇందులో రూ.10,000 శ్రీవాణి ట్రస్ట్ కు విరాళంగా, రూ.500 ప్రత్యేక దర్శనం టికెట్‌గా పరిగణిస్తారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు విడుదల అవుతాయి. మధ్యాహ్నం ఒంటి గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం దర్శనం కల్పిస్తారు. ప్రస్తుతం టీటీడీ ప్రతిరోజూ మొత్తం 1,500 శ్రీవాణి దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 టికెట్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా విడుదల చేస్తారు. అదనంగా తిరుపతి విమానాశ్రయంలో ప్రస్తుత బుకింగ్ కోటా కింద రోజుకు 200 టికెట్లను జారీ చేస్తున్నారు.
Read Also: సౌత్ ఇండియన్ కాశ్మీర్ ‘మున్నార్’.. హైదరాబాద్ నుంచి ఈ హిల్ స్టేషన్ కు వెళ్లాలంటే?