Dharmapuri Arvind: తెలంగాణ బీజేపీలో అంతా సెట్ అవుతుందనుకుంటున్న సమయంలో మరోసారి అంతర్గత విభేదాల అంశం తెరపైకి వచ్చింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పలువురు జిల్లా స్థాయి నేతలు తిరుగుబాటు మొదలుపెట్టారని సమాచారం. అర్వింద్ కు వ్యతిరేకంగా ఒక ఫామ్ హౌజ్ లో ఇటీవల కొందరు జిల్లా స్థాయి నేతలు సమావేశమైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ భేటీ వెనుక కొందరు కేంద్ర మంత్రుల ప్రోత్సాహం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రచారానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇప్పటివరకు వెలువడలేదు. దీంతో అసలు సమావేశం ఎందుకు జరిగింది? దాని వెనుక ఎవరున్నారు? అన్నదే బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఈ పరిణామాన్ని ఎంపీ అర్వింద్ వర్గం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం వద్దే తేల్చుకోవాలని అర్వింద్ వర్గీయులు భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులతో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి బుధవారం వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 500 కార్లతో రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి తమ బలాన్ని చూపించాలన్న ప్రతిపాదనపై అర్వింద్ అనుచరుల్లో చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంపైనా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. నిజంగా జరుగుతుందా? లేక సోషల్ మీడియాలో ప్రచారానికే పరిమతమవుతుందా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా నాయకుల మధ్య సమన్వయం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, నాయకుల మధ్య సమన్వయం పెంచడం, సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దడంపై దృష్టి పెట్టింది. ఇటీవల జాతీయ స్థాయిలో తెలంగాణ బీజేపీ నేతలతో సమీక్షలు, రాష్ట్ర నాయకత్వంతో సమావేశాలు జరగడం కూడా ఇదే క్రమంలో కనిపిస్తోంది. అలాంటి సమయంలోనే అర్వింద్ వ్యవహారం తెరపైకి రావడం పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. 22ఏ అంశం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రైతుల సమస్యలపై రాష్ట్రస్థాయి పోరాటాలకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో అంతర్గత విభేదాల వార్తలు రావడం నాయకత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అసలు అర్వింద్‌కు వ్యతిరేకంగా జిల్లా నేతల సమావేశం జరిగిందా? జరిగితే దాని ఉద్దేశం ఏమిటి? కేంద్ర మంత్రుల ప్రోత్సాహం ఉందన్న ప్రచారంలో నిజమెంత? అన్న ప్రశ్నలకు పార్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు 500 కార్లతో రాష్ట్ర కార్యాలయానికి వెళ్లాలన్న అర్వింద్ వర్గం ఆలోచన కార్యరూపం దాలిస్తే, అది బీజేపీలో అంతర్గత బలాబలాల ప్రదర్శనగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణకు చెందిన ఒక ఎంపీ కాంగ్రెస్ లోకి చేరాలని ఏఐసీసీ నేతలతో చర్చించారనే వార్తలు జోరుగా వచ్చాయి. ఆ కొద్దిరోజులకే ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా జిల్లా నేతలు రహస్య మీటింగ్ నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.
జాతీయ నాయకత్వం తెలంగాణలో పార్టీని వచ్చే ఎన్నికలకు మరింత పటిష్టంగా సిద్ధం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ.. ఇలాంటి అంతర్గత పరిణామాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో నాయకత్వ సమన్వయంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అర్వింద్ ఎపిసోడ్ కొత్త కోల్డ్ వార్‌కు నాంది అవుతుందా? లేక రాష్ట్ర నాయకత్వం జోక్యంతో ఈ వివాదం అక్కడికక్కడే సద్దుమణుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి మాత్రం అర్వింద్‌కు వ్యతిరేకంగా జరిగినట్లు చెబుతున్న జిల్లా నేతల భేటీ, దానికి కొనసాగింపుగా వినిపిస్తున్న 500 కార్ల వ్యవహారం తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also read: చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్