Power Bills: విద్యుత్ బిల్లులు తగ్గింపుపై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే తొలిసారి ట్రూడౌన్ తో విద్యుత్ ఛార్జీల భారం తగ్గించనున్నట్లు సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ నిర్ణయంతో నవంబర్ నుంచి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని అన్నారు.
15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన ఫలితాల కారణంగానే ఈ ఘనత సాధించామన్నారు. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ విధానం ద్వారా పీక్ డిమాండ్ ఉన్న సమయాల్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్ల విధానానికి చెక్ పెట్టామన్నారు. స్వల్ప కాలిక కొనుగోళ్లలో ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసే అవసరం లేకుండా పవర్ స్వాపింగ్ ఉపయోగపడిందని సీఎం తెలిపారు.
“పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రైతులకు సౌర విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నాం. పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందుతోంది. ఈ పథకంలో బీసీ వినియోగదారులకు గరిష్టంగా రూ. 98 వేలు సబ్సిడీ ఇస్తున్నాం. అంతే కాకుండా 1500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్టీ స్టోరేజ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. ఇలా అనేక చర్యలతో కూటమి ప్రభుత్వం సమర్థ నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టింది”-సీఎం చంద్రబాబు
తాజాగా ట్రూడౌన్ పేరుతో కరెంటు ఛార్జీలు తగ్గుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. యూనిట్ కు 13 పైసలు తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నవంబర్ నుంచి ట్రూ డౌన్ వర్తిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో చెప్పినట్లు ట్రూ డౌన్ ద్వారా ప్రజలకు రూ.923 కోట్ల మేర భారం తగ్గిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పి ప్రజలకు మరింత చౌకగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.
విద్యుత్ రంగంలో ఇప్పటికే మార్పు మొదలైందని సీఎం అన్నారు. ఈ మార్పు భవిష్యత్ లో మరిన్ని అద్భుత ఫలితాలను సాధిస్తుందన్నారు.
జగన్ ప్రభుత్వం ట్రూ అప్ పేరుతో విద్యుత్ భారాన్ని ప్రజలకు మోపిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ‘ట్రూ డౌన్’ పేరుతో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తుందన్నారు. మంగళగరిలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
Also Read: Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు తగ్గించి చూపించిందన్నారు. హ్యాండ్‌ల్యూమ్స్, సెలూన్‌లకు సబ్సిడీ ఇస్తున్నట్లు వెల్లడించారు. స్వలాభం కోసం వైసీపీ ప్రభుత్వం అధిక మొత్తానికి విద్యుత్ కొనుగోలు చేసిందని ఆరోపించారు. శాసనమండలిలోనే ట్రూ డౌన్‌పై ప్రకటన చేయాలని భావించామని, వైసీపీ కాఫీ వివాదంతో ఈ అంశం సభలో చర్చకు రాలేదన్నారు.