Tirupati Ragging: తిరుపతి జిల్లా నారాయణవనంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటన ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి లోకేశ్ తెలిపారు. జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థుల అమానుష దాడి కలచివేసిందన్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై యాజమాన్యం ఇప్పటికే చర్యలు తీసుకుందని చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ ను వీడి స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతి జిల్లా నారాయణవనం సిద్ధార్థ కాలేజీ హాస్టల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. జూనియర్ విద్యార్థిని కాళ్లతో తన్నుతూ అమానుషంగా దాడి చేశారు. సిద్ధార్థ కాలేజీలో ఫస్టియర్ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పేరుతో దాడికి దిగారు. జూనియర్ పై దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
జూనియర్ పై మొత్తం ఆరుగురు సీనియర్లు దాడి చేశారు. దాడి విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. ర్యాగింగ్ వీడియోలు బయటకు రావడంతో పోలీసులు కాలేజీ హాస్టల్ కు చేరుకుని విచారించారు. అయితే ఓ యువతితో ప్రేమ వ్యవహారంలో ఈ దాడి జరిగిందని పోలీసులు నిర్థారించారు. బాధితుడి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు హాస్టల్ కు చేరుకుని తమ కుమారుడ్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు.
మంచి భవిష్యత్ కోసం హాస్టల్‌లో వేసి చదివిస్తుంటే ఇంత దారుణంగా దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన ఆరుగురు సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్ల దాడిలో గాయపడిన జూనియర్ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.
Also Read: Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?
ర్యాగింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ర్యాగింగ్ ఘటనపై సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం స్పందించింది. ఇప్పటికే సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. దాడి చేసిన వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపింది.