School Student Tied: హర్యానా పానిపట్ పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి విద్యార్థిపై ప్రిన్సిపల్ అమానుష దాడికి పాల్పడింది. హోంవర్క్ చేయలేదని కిటికీకి తలకిందులుగా కట్టేసి డ్రైవర్ తో కొట్టించింది. బాలుడ్ని కిటికీకి కట్టిన వీడియోలు వైరల్ కావడంతో హర్యానా పోలీసులు సోమవారం స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆగస్టు 13న జరిగి ఈ ఘటన సెప్టెంబర్ 27న వెలుగులోకి వచ్చింది.
పానిపట్‌లోని జట్టల్ రోడ్డులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణ ఘటన జరిగింది. ముఖిజా కాలనీకి చెందిన డోలీ అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడిని ఇటీవల ఈ స్కూల్ లో చేర్పించారు. అయితే తన కుమారుడు హోంవర్క్ చేయలేదని ప్రిన్సిపాల్ రీనా కోపంతో బాలుడిని కిటికీకి కట్టి డ్రైవర్ అజయ్‌కు కొట్టించారని ఆమె ఆరోపించారు. ప్రిన్సిపాల్ చెప్పడంతోనే డ్రైవర్ బాలుడిని తాళ్లతో కిటికీకి తలక్రిందులుగా కట్టి దారుణంగా కొట్టాడని బాలుడి తల్లి ఆరోపించారు.
బాలుడిని కిటికీకి తలకిందులుగా కట్టి డ్రైవర్ వీడియోలు తీశాడు. తన స్నేహితులకు వీడియో కాల్స్ చేసి బాలుడ్ని చూపించాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో బాలుడి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతోపాటు ప్రిన్సిపాల్ రీనా చిన్నారులను చెంపలపై దారుణంగా కొడుతున్న మరో వీడియో వైరల్ అయ్యింది. స్కూళ్లలో శారీరక దండనపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు ఉపాధ్యాయులు దారుణంగా కొడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొన్నిసార్లు పిల్లలతో టాయిలెట్లు కూడా కడిగిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
వీడియోలు వైరల్ కావడంతో ప్రిన్సిపాల్ రీనా స్పందిస్తూ.. ఆగస్టు 13న బాలుడిని మందలించమని మాత్రమే డ్రైవర్ అజయ్ తో చెప్పానని, బాలుడ్ని కిటికీ కట్టిన విషయం తనకు తెలియదని ఆమె పేర్కొంది. ప్రవర్తన సరిగా లేదన్న ఫిర్యాదులతో అజయ్‌ను ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. అయితే వీడియో వైరల్ అవ్వడంతో అజయ్ కొందరు వ్యక్తులతో బాలుడి ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read: Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
బాధిత బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ప్రిన్సిపాల్ రీనా, డ్రైవర్ అజయ్‌పై కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. స్కూళ్లలో పిల్లల రక్షణ చట్టాలను మరింత కఠినం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.