Kadapa District: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో కొన్ని గ్రామాల్లో విచిత్రమైన ఆచారం కొనసాగుతోంది. బూచుపల్లె, భద్రంపల్లె, లోమడ్, బోడివారిపల్లె, మల్లెల్, తొండూరు, ఇనాగ్లూరు, సంతకవూరు, అగడూరు లాంటి చుట్టుపక్కల గ్రామాల్లో బూచుపల్లె వంశస్థులకు చెందిన కుటుంబాలు వెయ్యికి పైగానే ఉంటాయి. అయితే ఇది కేవలం వారికే సాంప్రదాయమే కాదు.. దైవిక ఆదేశాలతో ముడిపడిన ఆచారం. పెళ్లి మండపంలో తాళి కట్టిన వెంటనే వరుడిని మూడు కొరడా దెబ్బలు కొట్టడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది.
మంగళవాయిత్రాలు మనసు మెరిసేలా మిరిసిన మండపం.. వధువు పచ్చని చీరలో అలంకరించబడి పెళ్లి మండపంలో కూర్చుని ఉంటుంది… వరుడు సౌమ్యమైన స్వభావంతో మెడలో తాళిని కడుతుంటాడు. పెళ్లికూతరికి తాళి కట్టిన వెంటనే.. మండపంలో ఒక వింత శబ్దం.. టప్.. టప్..టప్.. వరుడి సోదరులు లేదా బంధువులు, ఒక చిన్న కొరడా (కర్ర వంటి చిన్న డబ్బ)తో మెల్లగా మూడు దెబ్బలు కొడుతారు. ఇది ఎలాంటి ఆగ్రహానికి సంబంధించినది కాదు.. దైవిక ఆజ్ఞ పాటించడం కోసం బూచుపల్లె వంశస్థులు ఈ ఆచారాన్ని కొన్ని వందల ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. వరుడు అలా నవ్వుతూ.. మండపంలో కుటుంబ సభ్యులు, బంధువుల చిరునవ్వులు చెప్పుకుంటూ.. ఆచారం పూర్తవుతుంది. ఈ కొరడా దెబ్బల్లో చాలా అర్థం ఉంటుంది. అవి దంపతుల జీవితంలో ఐక్యత, సహనం, దైవభక్తిని సూచిస్తాయి. శతాబ్దాలుగా ఈ ఆచారం సంస్కృతి గొప్పతనాన్ని చాటుకుంటోంది.
ALSO READ: VC Sajjanar: ఆర్టీసీతో నాలుగేళ్ల ప్రయాణం ముగిసింది.. వీసీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్
ఈ ఆచారానికి మూలం ఓ పెద్ద కథే ఉంది. శతాబ్దాల క్రితం, బూచుపల్లె పూర్వీకులు గంగమ్మ దేవాలయం నుంచి ఒక దైవానికి సంబంధించి వస్తువును (పెట్టె) తప్పుగా తీసుకువచ్చారు. ఇంట్లో తెరిచి చూస్తే.. అందలో ఆరు కొరడాలు (కర్రలు) ఉన్నాయి. తమ తప్పును గ్రహించి బూచుపల్లి వంశస్థులు దేవతకు క్షమాపణ కోరారు. అప్పుడు గంగమ్మ అమ్మవారు ప్రత్యక్షమై.. ‘మీ వంశంలో జరిగే ప్రతి పెళ్లిలో, తాళి కట్టిన తర్వాత వరుడికి మూడు కొరడా దెబ్బలు కొట్టాలి’ అమ్మ వారు ఆదేశించారు. ఆ క్షణం నుంచి ఈ ఆజ్ఞను పూర్తిగా పాటిస్తూ.. వారు దైవిక అనుగ్రహాన్ని పొందారని నమ్ముతారు. ఇక అప్పటి నుంచి దీన్ని ఆనవాయితీగా ఈ వంశస్థులు పాటిస్తున్నారు.
ఈ ఆచారం ఆధునిక కాలంలో కూడా మారకుండా ఉండటం నిజంగా హైలెట్ అని చెప్పవచ్చు. యువత, టెక్నాలజీ యుగంలో కూడా ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. ఇది కేవలం ఒక ఘటన కాదు.. సంస్కృతి, ఆచారాల ప్రత్యేకత, దైవికతతో ముడిపడిన మానవ జీవితాన్ని సూచిస్తుంది. బూచుపల్లె వంశస్థుల ప్రతి కొరడా దెబ్బలో దాగి ఉన్నది స్నేహం, సహనాన్ని సూచిస్తుంది.