Uppada Fishermen Issue: కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ తో ఎమ్మెల్సీ హరిప్రసాద్, పిఠాపురం ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన నేతలు భేటీ అయ్యి పిఠాపురం అభివృద్ధి పనులపై చర్చించారు. మత్స్యకారుల సమస్యలు, కంపెనీల కాలుష్యంపై కలెక్టర్ తో నేతలు చర్చించారు.
మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై ఈ సమావేశం చర్చించారు. వచ్చే నెల 10లోగా పవన్ కల్యాణ్ ఉప్పాడ రావాలని మత్స్యకారులు డెడ్ లైన్ పెట్టారు. అప్పటి వరకు వేటకు వెళ్లమని ఇళ్ల దగ్గరే ఉంటామని మత్స్యకారులు చెబుతున్నారు.
సముద్ర తీర ప్రాంతాల్లోని రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మత్స్య సంపద అంతరించిపోయి, తమ జీవనోపాధికి ఆటంకం కలుగుతుందని ఉప్పాడ మత్స్యకారులు ఇటీవల ఆందోళనకు దిగారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల ఆందోళనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్టోబర్ 2 నుంచి 10లోగా ఉప్పాడలో మత్స్యకారులతో సమావేశం అవుతారని డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామ స్వామి, కలెక్టర్ హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. పవన్ కల్యాణ్ వచ్చే నెల 10లోగా ఉప్పాడ రాకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని మత్స్యకారులు హెచ్చరించారు.
ఫార్మా పరిశ్రమల ప్రభావం వల్ల మత్స్యకారుల జీవనోపాధిపై కలుగుతున్న ప్రభావాలను గురించి, వారి సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ఎక్స్ వేదికగా తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తానన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీష్, రెవెన్యూ ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్ తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో మత్స్యకారులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
Also Read: Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు
ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామన్నారు. త్వరలో తానే స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో సమావేశమై సమస్యలపై సమగ్రంగా చర్చిస్తానన్నారు.