Janasena: వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన నేతలపై జనసేన ఫోకస్ చేసిందా? కూటమి సర్కార్ కేసుల నుంచి తప్పించుకునేందుకు వస్తున్నారా? లేకుంటే పార్టీని డ్యామేజ్ చేయడానికి వస్తున్నారా? అనేదానిపై అంతర్గతంగా ఎప్పుటికప్పుడు వివరాలు తెప్పించుకుంటోందట జనసేన హైకమాండ్. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై వేటు వేసింది. అసలేం ఏం జరిగింది?
ఏపీలో వైసీపీ అధికారం పోయిన తర్వాత నేతలు వలసపోతున్నారు. మరో పదేళ్లు వైసీపీలో లైఫ్ ఉండదని భావిస్తున్నారు నేతలు. ఈ క్రమంలో కూటమిలోని పార్టీల వైపు చూస్తున్నారు. తొలుత టీడీపీతో సంప్రదింపులు చేస్తున్నారు. కాదంటే జనసేన వైపు వెళ్తున్నారు. అక్కడ సానుకూలంగా లేకుంటే బీజేపీ వైపు వెళ్తున్నారు.
అలాంటి వారిలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఒకరు. టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నర్సింగ్ కాలేజీ వివాదం ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. దీంతో టీడీపీ పక్కన పెట్టింది. ఈలోగా రాష్ట్ర విభజన జరగడంతో సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలోకి వెళ్లారు.
ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన వైపు వెళ్లడం, ఆయనకు కొవ్వూరు నియోజకవర్గం బాధ్యతలను ఆ పార్టీ అప్పగించింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉన్నాయి. అందులో మూడు పదవులు తమకు కేటాయించాలని ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జి టీవీ రామారావు పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు.
ALSO READ: విజయసాయిరెడ్డికి సిట్ మళ్లీ పిలుపు
హైకమాండ్‌ని సంప్రదించకుండా ఆయన ఆందోళన చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది జనసేన. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా రామారావు కామెంట్స్, కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చింది. దీనిపై ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హైకమాండ్ వేటు వేసింది.
కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగేలా రామారావు చర్యలు ఉన్నాయని, అందుకే నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తక్షణమే తప్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రామారావును ఆదేశించింది. మొత్తానికి తక్కువ సమయంలో టీవీ రామారావు టీడీపీ మొదలు జనసేన వరకు పార్టీలు మారారు. ఇక ఆయనకు మిగిలిన ఏకైక ఆప్షన్ బీజేపీ మాత్రమే.
టి.వి రామారావు గారిని జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించడమైనది. pic.twitter.com/f80zCFSce2
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 10, 2025