Kokari Robbery @ 100 Years: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక మలుపు గుర్తింపు తెచ్చుకున్నఉత్తర ప్రదేశ్ కాకోరి రైలు దోపిడీ సంఘటనకు 100 ఏళ్లు అయ్యాయి. ఉద్యమం చేసేందుకు తుపాకులు కొనుగోలు చేసేందుకు రైలులోకి చొరబడిన విప్లవకారులు దాదాపు రూ.4,600 నగదును దోచుకెళ్లారు. ఈ దోపిడీకి పాల్పడిన పలువురు ఉద్యమకారులను బ్రిటీష్ పాలకులు పట్టుకుని చిత్ర హింసలకు గురి చేశారు. వారిలో నలుగురు విప్లవకారులకు ఉరిశిక్ష విధించారు. ఈ సంఘటన కాకోరి స్టేషన్ సమీపంలో జరగడంతో కాకోరి రైలు దోపిడీగా చరిత్రలోకి ఎక్కింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు.. స్వాతంత్ర్య ఉద్యమం ఉధృతం అయిన రోజులవి. 1920లో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. కొద్ది కాలంలోనే బ్రిటిషర్ల కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. ఓవైపు శాంతియుతంగానే కొట్లాడుతూ, మరోవైపు హింసాత్మకంగా ముందడుగు వేశారు. ఉద్యమకారులు ఘోరక్ పూర్ లోని చౌరీ చౌరా పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో సుమారు 20 మంది పోలీసులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనతో ఉద్యమాన్ని ఆపాలని గాంధీజీ నిర్ణయించారు.
గాంధీ నిర్ణయంతో యువ ఉద్యమకారుల నిరాశ
ఉద్యమాన్ని ఆపాలనే గాంధీ నిర్ణయం యువ ఉద్యమకారులకు తీవ్ర నిరాశను కల్పించింది. సొంతంగా పార్టీ పెట్టి ఉద్యమాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని భావించారు. శచీంద్రనాష్ సన్యాల్ నాయకత్వంలో హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ పార్టీని స్థాపించారు. యోగేష్ చంద్ర ఛటర్జీ, రాంప్రసాద్ బిస్మిల్, సచింద్రనాథ్ బక్షి పార్టీలోని ముఖ్యమైన సభ్యులుగా ఉన్నారు. అనంతర కాలంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఈ పార్టీలో చేరారు. స్వాతంత్ర్యం కోసం ఆయుధాలు చేతపట్టాలని ఈ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. తుపాకులు కొనేందుకు డబ్బు సేకరణ కోసం దోపిడీలు చేశారు. అప్పట్లో వీరిని బందిపోటు దొంగలుగా అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చిత్రీకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు డబ్బును తరలించే రైలులో దోపిడీకి పాల్పడాలని నిర్ణయించారు.
Read Also: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!
కాకోరి సమీపంలో రైలు దోపిడీ
10 మంది విప్లవకారులు షహరాన్ పూర్ నుంచి లక్నోకు వస్తున్న రైలును టార్గెట్ చేశారు. ఆగష్టు 9, 1925 రోజున కాకోరి రైల్వే స్టేషన్ దగ్గర రైలును అడ్డగించారు. గార్డును అదుపులోకి తీసుకుని రైలులోని రూ.4,601 నగదును దోచుకున్నారు. అప్పట్లో ఈ ఘటన బ్రిటిషర్లను భయపెట్టింది. ఈ ఘటనతో సంబంధమున్న 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించి.. 10 మందిని దోషులుగా తేల్చారు. 1927 ఏప్రిల్ 6 న తీర్పు వెలువరించి నలుగురిని ఉరి తీశారు. మిగతా వారికి జీవిత ఖైదు విధించారు. చంద్రశేఖర ఆజాద్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోగా, సాక్షులుగా మారడంతో మరో ఇద్దరిని విడిచిపెట్టారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ ఘటన ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.
Read Also: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?