Pulivendula: వైఎస్ వివేకానంద కేసులో అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వివేకానంద కూతురు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు నిందితులు బయట తిరుగుతున్నారని, బాధితులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాదు ఈ కేసును టీడీపీ నేతలతో నెట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు మనసులోని మాట బయటపెట్టారు సునీత.
శుక్రవారం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు హైదరాబాద్‌లో ఉన్న సునీత పులివెందులకు వచ్చారు. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కడప ఎస్పీ అశోక్‌కుమార్‌ను సునీత-ఆమె భర్త రాజశేఖరరెడ్డి దంపతులు గురువారం కలిశారు. ఈ కేసు తాజా పరిణామాలను ఆయనకు వివరించారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సునీత కీలక విషయాలు బయటపెట్టారు. పులివెందులలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆరేళ్ల కిందట వివేకానందను హత్య జరిగిన రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు. మా అమ్మ ఫోన్ చేసి పులివెందులకు రావొద్దని తనకు చెప్పారని, ఇక్కడ పరిస్థితులు బాగాలేవని హెచ్చరించిన విషయాన్ని బయటపెట్టారు.
నాన్నను గొడ్డలితో నరికి చంపి, గుండెపోటుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న హత్య తర్వాత ఓ లేఖ ఇచ్చారని, టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సతీష్‌కుమార్ రెడ్డిలు చంపినట్లు ఆ లేఖపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారని వివరించారు. ఎవరు ఒత్తిడి చేశారన్నది ఆమె వెల్లడించలేదు.
ALSO READ: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త, లోకేష పవర్ ఫుల్ పంచ్
నాన్నని టీడీపీ నేతలు హత్య చేశారంటే తొలుత నమ్మానని, చివరకు నారాసుర రక్తచరిత్ర అంటూ తాటికాయంత అక్షరాలతో పేపర్‌లో బ్యానర్ వార్త వచ్చిందన్నారు. చివరకు తాను, తన భర్త రాజశేఖరరెడ్డి కలిసి చంపామంటూ మాపై ఆరోపణలు చేశారని, చివరకు కేసులు పెట్టారని వాపోయారు ఆమె. న్యాయం కోసం పోరాడుతున్నందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
తప్పు చేసిన వారు జైల్లో ఉంటే ఈ భయం ఉండేది కాదన్నారు. నిందితులంతా బయటే ఉన్నారని చెప్పారు. ఇది న్యాయమా? ఇంకెన్ని రోజులు పోరాటం చేయాలని ఆవేదనను వెళ్ళగక్కారు. ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. ఈ కేసులో తాను సాక్షినని, తనమీదే కేసులు పెడుతున్నారని వాపోయారు.ఇది బెదిరింపు కాకపోతే ఏంటన్నది ఆమె సూటి ప్రశ్న.
వాళ్లు బెదిరించిన మాత్రాన లొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. న్యాయం కోసం పోరాడటానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాలా? అని ప్రశ్నించారు. తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరు అన్నది సీబీఐ తేల్చిందని, ఆరేళ్లుగా ఎవరికీ శిక్ష పడలేదన్నారు. ప్రస్తుతం ఎంపీ అవినాష్‌రెడ్డి, సతీష్‌కుమార్‌రెడ్డి పోలీసులను బెదిరించేలా మాట్లాడుతున్నారని ఆమె వాదన. ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని, పూర్తి నమ్మక ఉందని వ్యాఖ్యానించారు.