SU from SO Telugu Review : ఈ వారం ‘సు ఫ్రొం సో’ అనే డబ్బింగ్ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది మెప్పించే విధంగా ఉందా? లేక సింపుల్ గా స్కిప్ చేసే విధంగా ఉందా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
కథ :
ఒక ఊరులో ఓ పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ అశోక్ (జెపి తుమినాడ్) ఫుల్లుగా తాగి వెళ్తుండగా ఒక అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తుండటాన్ని గమనించి నేత్రానందం పొందుతాడు. అది గమనించిన జనాలు అశోక్‌ని కొట్టాలని ప్రయత్నిస్తారు. దీంతో అతను దయ్యం పట్టినట్టు హడావిడి చేసి పడిపోతాడు. ఇది నమ్మిన ఊరు జనాలు.. మరింతగా ఆ వార్తను ప్రచారం చేస్తారు. ఆ టైంకి ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్) ఊర్లో ఉండడు. దీంతో మిగిలిన జనాలు ఓ పూజారిని తీసుకొచ్చి అశోక్‌లో ఉన్న దయ్యాన్ని వదలగొట్టాలని చూస్తారు.
ఈ క్రమంలో అశోక్‌లో ఉన్న ఆత్మను కనుగొనడానికి ఆ పూజారి ప్రయత్నించగా అశోక్ సరదాగా తన పేరు కాంచన అని పేరు చెబుతాడు. కానీ జనాలు అది సులోచన అని ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ఓ పెద్దమనిషి సులోచన సోమేశ్వరం నుండి అని దానికి మరింతగా యాడ్ చేస్తాడు. మరో పక్క ఆ దయ్యాన్ని పోగొట్టడానికి కరుణాజీ స్వామిజి (రాజ్ బి శెట్టి)ని రంగంలోకి దించుతారు. ఆయన సులోచన గురించి వివరాలు కావాలని సోమేశ్వరం గ్రామానికి వెళ్లి రమ్మంటాడు. ఆ తర్వాత ఆ స్వామిజీ అశోక్‌ని చిత్ర హింసలు పెడుతుంటాడు.
దీంతో అశోక్.. దెయ్యం తనని వదిలి వెళ్ళిపోయింది అని చెప్పినా జనాలు నమ్మరు. మరోపక్క సోమేశ్వరంలో నిజంగానే సులోచన అనే ఆమె చనిపోతుంది. ఆమె కథేంటి? అశోక్ దయ్యం పట్టింది అని అబద్దం చెప్పినట్టా? నిజం చెప్పినట్టా? ఈ ప్రశ్నలకి సమాధానం మిగిలిన సినిమా అని చెప్పాలి.
విశ్లేషణ :
పేరుకు ఇది కన్నడ డబ్బింగ్ సినిమా. కానీ సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకి ఆ ఫీల్ అంతా పోతుంది. దర్శకుడు రాజ్ బి శెట్టి సినిమాలపై ఓటీటీ ఆడియన్స్‌కి కొంత నమ్మకం ఏర్పడింది. ఈ సినిమాతో ఆ నమ్మకం పెరుగుతుందే తప్ప తగ్గదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గతంలో కర్ణాటకలో ‘కూతురు పెళ్ళికి తల్లి ఆత్మ వచ్చింది’ అనే వార్త బాగా హల్ చల్ చేసింది. ఆ లైన్ ఆధారంగా ఈ ‘సు ఫ్రొం సో’ కథని డిజైన్ చేసుకున్నాడు రాజ్ బి శెట్టి.
సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఎంగేజింగ్ గా ఉంటుంది. నాన్ స్టాప్ గా జనాలు నవ్వుతూనే ఉంటారు అనడంలో కూడా అతిశయోక్తి లేదు. మధ్యలో కొంత లవ్ స్టోరీని కూడా పెట్టారు. అది ఇబ్బంది కరంగా ఏం లేదు.. అలాగని ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా కూడా ఉండదు. సెకండాఫ్ కొంత వేగం తగ్గింది అనడానికి అదే కారణం అనిపిస్తుంది.
అయితే కథ ముందుకు వెళ్తున్నప్పుడు అలా వేగం తగ్గడం అనేది కామన్ అనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ లో కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చి కన్విన్సింగ్ గా సినిమాని ముగించారు. హర్రర్ సినిమాలు అంటే ఆడియన్స్ రెగ్యులర్ అనే భావనకి వచ్చేసారు. కానీ ఈ ‘సు ఫ్రొం సో’ కి హర్రర్ టచ్ ఇచ్చినా.. అది రెగ్యులర్ గా లేదు.
నటీనటుల విషయానికి వస్తే.. దర్శకుడు రాజ్ బి శెట్టి ఈ సినిమాలో స్వామిజి పాత్ర పోషించడం జరిగింది. ఆయన కథ కాబట్టి.. పాత్రని ఓన్ చేసుకుని హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. జెపి తుమినాడ్ బాగా చేశాడు. షనీల్ గౌతమ్,. సంధ్య అరకెరె కూడా బాగా చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
కామెడీ
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
లవ్ స్టోరీ
సెకండాఫ్‌లో కొంత వేగం తగ్గడం
మొత్తంగా.. ఈ ‘సు ఫ్రొం సో’ ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్లిన వాళ్లకి ఫుల్ శాటిస్ఫెక్షన్ ఇచ్చే మూవీ. వీకెండ్ కి థియేటర్స్ లో ట్రై చేయొచ్చు.
SU from SO Telugu Movie Rating : 2.75/5