Jagan Fear: వైసీపీ అధినేత జగన్‌కు భయం పట్టుకుందా? ఎందుకు భారీగా ప్రైవేటు సైన్యాన్ని మొహరిస్తున్నారు? తమ్ముడి ఫార్ములాని ఫాలో అవుతున్నారా? లిక్కర్ కేసులో నోరు ఎత్త వద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పారు? ఈ లెక్కన జగన్‌కు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.
జగన్ పేరు చెబితే చాలు.. మాట తప్పడు.. మడం తిప్పడని, వాటికి కేరాఫ్‌గా చెబుతారు ఆ పార్టీ నేతలు. ఆ మాటలన్నీ 2014-19 కాలంలో. అధికారంలోకి వచ్చిన మాట తప్పారు.. మడం తిప్పారు కూడా. అది వేరే విషయం. ఇదీ కూడా ఓ రికార్డు అనుకోండి అది వేరే విషయం. అసలు విషయానికి వచ్చేద్దాం.
జగన్ భద్రతపై వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం జెడ్ ప్లస్ స్థాయిలో సెక్యూరిటీ ఇస్తోంది. ఆయన వెంట దాదాపు 58 మంది వరకు అధికారిక సిబ్బంది ఉంటారు. ఆ సెక్యూరిటీ కాకుండా మాజీ ఆర్మీ అధికారులు రక్షణగా నియమించుకున్నారు. ఇదికాకుండా మరో 40 మంది ప్రైవేటు సెక్యూరిటీ ఉంది కూడా. ఇది కాకుండా ఇంకో 40 మంది బౌన్సర్లను నియమించుకుంది.
దాదాపు 170 మంది వరకు ఆయనకు సెక్యూరిటీగా ఉంటారన్న మాట. అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 1000 మంది వరకు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఉండేవారని కూటమి ప్రభుత్వం గతంలో చెప్పింది. ఉన్నట్లుండి సెక్యూరిటీని జగన్ ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు? చాలామందికి అంతుబట్టడం లేదు.
ALSO READ: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం
లిక్కర్ కేసులో రేపో మాపో ఆయన్ని అరెస్టు చేస్తారంటూ కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో అలర్టయిన జగన్, భారీగా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పార్టీ కీలక నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు. మూడేళ్ల కిందటికి ఒక్కసారి వెళ్లే.. వివేకానంద హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు చేసిన ఫార్ములాను జగన్ అనుసరిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.
కర్నూలు ఆసుపత్రిలో అవినాష్‌కు నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు. తొలుత కార్యకర్తలు, ఆ తర్వాత నేతలు, ఇంకో విభాగంలో సొంతం సైన్యం, చివరకు ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ ఉండేది. ఇవన్నీ పరిశీలించిన సీబీఐ అధికారులు, అరెస్టు చేయకుండానే వెనుదిరిగారు. ఇదే ఫార్ములాను జగన్ కూడా ఫాలో అవుతున్నట్లు కొందరు అనుకుంటున్నారు.
రీసెంట్‌గా వైసీపీ లీగల్ సెల్ టీమ్‌తో అధినేత జగన్ భేటీ అయ్యారు. లిక్కర్ కేసులో తనను అరెస్టు చేసేందుకు కూటమి ప్రభుత్వం సంకేతాలు ఇస్తోందని, అరెస్టు నుంచి మీరే కాపాడాలని వారిని చెప్పినట్టు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఇప్పటికే కీలక నేతలను ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఈ విషయంలో కాసింత అలర్ట్‌గా ఉండాలని చెప్పారట.
బుధవారం కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు రాజకీయాలపై చర్చించారు. లిక్కర్ కేసులో అరెస్టుల గురించి ఏ మాత్రం మాట్లాడవద్దని చెప్పారట. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించిన జగన్, ప్రైవేటు సైన్యం పెంచడం, లీగల్ సెల్ టీమ్ భేటీ కావడం వంటివి పరిశీలించినవారికి అధినేతకు అరెస్టు గండం ఉందని అంటున్నారు.