Montha Cyclone: ఏపీకి మొంథా తుఫాన్ గండం పొంచి ఉంది. ఈ తుఫాన్ కోస్తా జిల్లాలపై దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నైరుతి పశ్చిమ మధ్య బంగాళఖాతంలోని తుఫాన్ బలపడిందని ఐఎమ్‌డీ తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుంది. ఇక అదే రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం దాదాపు 12 గంటల తీవ్రత కొనసాగుతోందని ఐఎమ్‌డి సూచించింది. తరువాత తుఫానుగా బలహీన పడవచ్చని పేర్కొంది.
దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ, బుధవారాల్లో గంటకు 110 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తుఫాను ప్రభావం పలు జిల్లాలపై తీవ్రంగా ఉన్నట్లు ఐఎమ్‌డీ వెల్లడించింది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే మంగళవారం 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్, నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణ పట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేసింది.
తుఫాను నేపథ్యంలో సహాయక చర్యల కోసం 9 SDRF, 7NDRF బృందాలు జిల్లాల్లో సిద్దంగా ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరికొన్ని బృందాలు హెడ్‌క్వాటర్స్‌లో సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read: ఏపీపై ‘మొంథా’ తుపాను.. అలర్టయిన ప్రభుత్వం, పాఠశాలలకు సెలవులు
మొంథా తుఫాను దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టరేట్, ఆర్డీఓ కాల్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ప్రజలు సహాయం కోసం ఎన్టీఆర్ కలెక్టరేట్ నంబర్: 9154970454 ను సంప్రదించవచ్చు. బాపట్ల జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రజలు 08643220226 నంబర్ కాల్ చేయాలని సూచించారు. అధికారులు సూర్యలంక బీచ్ మార్గాన్ని మూసివేసి మత్స్యకారులను వేటకు వొళ్లొద్దని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం నిత్యవసర సరుకులను సిద్ధం చేసింది.