Gold Theft: నిజామాబాద్ జిల్లాలో దొంగల భీభత్సం సృష్టంచారు. బాసర ప్రధాన రహదారిపై ఉన్న వైష్ణవి సిల్వర్ మర్చంట్ షాప్‌లో భారీ దోపిడీ జరిగింది. గ్యాస్ కట్టర్ సహాయంతో షట్టర్‌ను కోసి లోపలికి చొరబడ్డ దొంగలు.. సుమారు రూ. 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బాసర రోడ్డులోని వైష్ణవి సిల్వర్ మర్చంట్ షాప్ యజమాని.. ప్రతీరోజు మాదిరిగానే శనివారం రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం షాప్ తెరవడానికి వచ్చేసరికి.. షట్టర్ కత్తిరించబడి ఉన్నట్లు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, రూరల్ సీఐ, పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
దుకాణంలో ఉన్న గ్లాస్ షోకేస్‌లు పగలగొట్టి, వాటిలో ఉంచిన బంగారం, వెండి ఆభరణాలు లేకపోవడం గమనించారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా.. రాత్రి 2 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు షాప్ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్న దృశ్యాలు రికార్డయ్యాయి. దొంగతనం ఆ తరువాత గ్యాస్ కట్టర్ సహాయంతో షట్టర్ కట్ చేసి లోపలికి ప్రవేశించి ఆభరణాలు తీసుకెళ్లారు. అయితే నిందితులు ముఖాలకు మాస్కులు ధరించడం, తలపై హెల్మెట్లు వేసుకోవడం వల్ల వారి గుర్తించడం కష్టంగా మారింది.
Also Read: టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల మందు తిని మూడేళ్ల చిన్నారి మృతి
ఈ ఘటనపై పోలీస్ అధికారులు సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతర సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించి దొంగల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటాం. ఇది ప్రొఫెషనల్ గ్యాంగ్ పని అనిపిస్తోంది అని దర్యాప్తు అధికారులు తెలిపారు.